Mother and son attempted suicide: నంద్యాల జిల్లా బనగానపల్లిలో పోలీసులు తిట్టారని తల్లి, కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. మండల పరిధిలోని చిన్నరాజుపాలెం గ్రామానికి చెందిన గుర్రమ్మ( 45), దస్తగిరి (24)లను ఎస్సై శంకర్ నాయక్ దుర్భాషలాడి తిట్టారని పురుగుల మందు తాగారు. గ్రామంలో జరిగిన చిన్నపాటి ఘర్షణకు ఇరువు వర్గాలను పిలిపించి ఎస్సై పోలీస్ స్టేషన్లో తిట్టడంతో మనస్థాపానికి గురైన దస్తగిరి బయటికి వచ్చి పురుగుల మందు తాగాడు.
దీంతో బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే తల్లి గురమ్మ పురుగుల మందు తాగింది. ఈమెను ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే అక్కడ కుమారుడు మృతి చెందాడు. దీంతో కోపోద్రికులైన బంధువులు శవాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చి నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్డుపై బంధువులు... కార్యకర్తలతో కలిసి బీసీ నిరసన చేశారు. బాధితులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తానన్నారు. తక్షణమే ఎస్సై శంకర్ నాయక్‌ను సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్ రెడ్డి, కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి, ఎస్సై రామిరెడ్డి, పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో బీసీ నిరసన దీక్షను విరివింపజేశారు. ఈ సంఘటన జరగడంతో పోలీసులను పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు ఇతర ప్రాంతాల నుంచి రప్పించారు. ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో కేసులు నమోదు చేశాము ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదని ఎస్సై శంకర్ నాయక్ తెలిపారు.
ఇవీ చదవండి: