Food industry is expanding in Hyderabad: బిర్యానీకి పెట్టింది పేరైన ‘భాగ్యనగరంలో’ ఫుడ్ ఇండస్ట్రీ పుంజుకుంటోంది. మూడు నెలలకోసారి ఏదో ఓ ప్రాంతంలో కొత్తథీమ్‌తో రెస్టారెంట్‌లు.. రుచులు పరిచయం అవుతున్నాయి. కరోనా వేళ చతికిలపడిన ఈ రంగం వినియోగదారుల ఆదరణతో ఇప్పుడు దూసుకుపోతోంది. శని, ఆదివారాల్లో స్ట్రీట్‌ఫుడ్ వాక్ అంటూ నగరవాసులు ఆ విశేషాలను సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.
కొంగొత్తు రుచులు.. వినూత్న పేర్లు:
- బిహార్‌లో పేరొందిన చంపారన్ బిర్యానీ ఇప్పుడిప్పుడే నగరంలోనూ ఆదరణ పొందుతోంది. కూకట్‌పల్లి అంబభవానీ హోటల్‌లో మట్టికుండలో ఆవాల నూనె, వెల్లుల్లితో, వేర్వేరు మసాలా దినుసులతో కస్టమర్ల ముందే 25నిమిషాల్లో బొగ్గులపై తయారుచేసిన చికెన్, మటన్ బిర్యానీ అందిస్తున్నారు.
- బాహుబలి తాలి పేరుతో ఇచ్చిన సమయంలో పూర్తిగా తిన్నవారికి నగదు బహుమతి, వేర్వేరు రెస్టారెంట్లలో లెమన్ చికెన్, బ్లూబెర్రీ మోజిటో, సిజ్లర్ బ్రౌనీ, తిందుదా, తినేస్‌పో, ఫుడ్‌వర్క్‌షాప్, గర్ల్‌ఫ్రెండ్ మంది, ఫుడ్ గ్యారేజీ వంటి పేర్లతో ఆకటుకుంటున్నారు. ఆకర్షించే వాతావరణం కోసం వేర్వేరు డిజైన్లలో ద్విచక్ర వాహనాలను ఆవరణలో ప్రదర్శిస్తున్నారు.
- హైటెక్‌సిటీలోని శ్రీనివాస్‌మిక్చర్ పాయింట్ నిర్వాహకులు బజ్జీల్లో వెరైటీలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. గులాబ్‌జామూన్ బజ్జీ, పైనాపిల్ బజ్జీ, ఎగ్‌బజ్జీ మిక్చర్, టొమాటో బజ్జీ అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి.
- మాదాపూర్ 100ఫీట్‌రోడ్‌లో ఉన్న ‘నూడుల్స్‌బార్’లో హనీ చిల్లీ ఫ్రైస్, చికెన్‌బర్న్ నూడుల్స్, చికెన్ ఫ్రైడ్ మోమోస్ షెజ్వాన్‌సాస్, తుప్కా పేర్లతో కొంగొత్తరుచులు ఊరిస్తున్నాయి. అందుబాటు ధరల్లో ఉండటంతో ఎక్కువ ఆదరణ లభిస్తోంది.
ఊరిస్తున్న వీధివంటకాలు: బొగ్గులకుంట మార్గంలో ఫుడ్‌జాయింట్ల వద్ద వారాంతాల్లో రద్దీ ఏర్పడుతోంది. ఇక్కడ ఫుడ్‌జాయింట్లలో బ్రేక్‌ఫాస్ట్, చాట్, పిజ్జాలు, పండ్ల రసాలు, కబాబ్‌లు, బిర్యానీల్లో పలు వెరైటీలు ఊరిస్తున్నాయి. అందుబాటు ధరల్లో, ఒకే మార్గంలో ఏర్పాటు చేస్తుండటంతో సెలవు రోజు రాత్రికుటుంబంతో కలిసి గడిపేందుకు ఆహార ప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు.
ఆహార వాహనాలు: ఫుడ్ ట్రక్ సంస్కృతి నగరం నలువైపులా విస్తరిస్తోంది. కూకట్‌పల్లి ఐడీఎల్ లేక్, మెట్టుగూడ మెట్రోస్టేషన్, మాదాపూర్‌లోని కరాచీ బేకరీ సమీపంలో, గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ సమీపంలో వెరైటీ వంటకాలు రుచిచూడొచ్చు. పొంగనాలు, మోమోలు, చైనీస్ ఫాస్ట్‌ఫుడ్, బార్బిక్యూ, మ్యాగీ, బాంబూ చికెన్, షవార్మాతో పాటు చికెన్‌లో అన్ని రకాల వెరైటీల్లో ఆహార లభ్యమవుతోంది.
ఎన్‌ఆర్‌ఏఐ ఫుడ్ సర్వీస్ రిపోర్టు ప్రకారం: నగరంలో రెస్టారెంట్ల మార్కెట్ షేర్: రూ.6,037కోట్లు ఉంది. ఒకే శాఖ ఉన్న వాటి షేర్ విలువ రూ.4,657 కోట్లుగా ఉన్నాయి. గొలుసుకట్టువి మార్కెట్ విలువలో రూ. 1380 కోట్లు.
ఇవీ చదవండి: