Blood donation on the day of marriage : సాధారణంగా పెళ్లి వేడుకలు అంటే అందరు బంధువిుత్రలను పిలిచి.. వివాహానంతరం విందు, చిందులతో వివాహ వేడుకలను జరుపుకుంటారు. కానీ నూతనంగా వివాహం చేసుకున్న జంట అందరిలా కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించి.. తమ వివాహం సందర్బంగా ఏదైనా మంచి పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం కొత్తగా ఆలోచించిన కొత్త జంట.. సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని తమ వివాహంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు.
నంద్యాలకు చెందిన సూర్యతేజ అనే అబ్బాయికి అనంతపురం జిల్లా గుత్తికి చెందిన భవ్య అనే అమ్మాయితో వివాహం జరిగింది. అనంతరం నంద్యాలలో రిసెప్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా తన సోదరుడి ప్రేరణతో రక్తదానం చేయాలనుకున్నట్లు వరుడు సూర్యతేజ తెలిపారు. అనుకున్న విధంగానే రక్తదాన శిబిరం నిర్వహించి ఆదర్శం అయ్యారు. ఈ శిబిరంలో వరుడితో పాటు బంధువులు, మిత్రులు పాల్గొని రక్తదానం చేశారు. దీనిని పురస్కరించుకొని పలువురికి మేలు జరిగే కార్యక్రమలు నిర్వహించాలని వరుడు సూర్యతేజ చెప్పారు. భర్త చేసిన ఈ కార్యక్రమం వల్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని వధువు భవ్య ఆనందం వ్యక్తం చేశారు.
మనం బతుకున్న ఈ స్వార్థపు సమాజంలో ఎదుటి వారికి సాయం చేయలేని వారు ఎందరో ఉన్నారు. కానీ అందరిలా కాకుండా తాను నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనే ఉద్దేశ్యంతోనే రక్తదాన శిబిరానికి శ్రీకారం చుట్టడం నిజంగా ప్రశంసించాల్సిన విషయం.
మా ఇద్దరి కలయికతో సమాజానికి మంచి చేయాలనే సదుద్దేశ్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మా సోదరుడి ప్రేరణతో మన వేడుకలో పది మందికి ఉపయోగ పడే పనులు చేయాలని నిర్ణయించుకొని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది.- సూర్యతేజ, వరుడు
మా వేడుక సందర్భంగా మా ఆయన ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందరికి గుర్తుండేలా ఈ కార్యక్రమం చేయటం ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది.- భవ్య ,వధువు
ఇవీ చదవండి: