Work From Home Manufacturing LED Bulbs : విద్యుత్ బల్బు ఫిట్ చేయండి.. నెలకు 20 వేలు సంపాదించండి..! ప్రకటన వినగానే ఫేస్ వెలిగిపోతోంది కదూ! అలాగని ఆశపడ్డారో మిగిలేది చీకట్లే..! ఔను కరెంటు బల్బులతో వెలుగులు నింపుతామని ఆశపెట్టి అమాయకుల జీవితాలను మాయగాళ్లు ఆర్పేశారు. దాదాపు వెయ్యి మంది నుంచి అర కోటికి పైనే కొల్లగొట్టారు. ఆదోనిలో వెలుగు చూసిన ఈ నయా మోసం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ ముసుగు వీరులు మందిని ముంచి పోలీస్ స్టేషన్‌లో తేలారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ఈ యువకులందరూ ఐటీఐ చదివారు. ఉద్యోగం చేసుకోవాలనే ఆలోచనలు వదిలేసి ఉపాయాలు వేయడం మొదలుపెట్టారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిద్దామన్నది వీళ్ల ఆలోచన. అందుకోసం అడ్డదారులు ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతికారు. చివరకు యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. అందులో ఒక వీడియో చూసి అమాయకులకు గాలం వేయాలని నిర్ణయించారు.
ఐటీ అధికారులమంటూ సినీ ఫక్కీలో చోరీ.. ఛేదించిన పోలీసులు
అసలే ఎండలు ఇంట్లోనే కూర్చుని పనిచేసుకుంటే నెలకో 20 వేల ఆదాయం వస్తే అంతకుమించి కావాల్సింది ఏముంటుంది? ఇలా ఆలోచిస్తున్న వాళ్లకే వీళ్లు గాలం వేశారు. నకిలీ ఆధార్‌తో సిమ్ కార్డులు తీసుకుని నవ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ పేరుతో నకిలీ సంస్థ పెట్టారు. ఓ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఇంటి వద్దే ఎల్ఈడీ బల్బులు తయారీ చేయండి. ఇంటి వద్ద నుంచే డబ్బులు సంపాదించుకోండి అంటూ గాలం వేశారు. దానికి అవసరమైన ముడిసరుకు కూడా తామే సరఫరా చేస్తామంటూ వలపన్నారు.
ఆ ప్రకటన నమ్మిన అమాయకులు ఓ నిమిషం కూడా ఆలోచించకుండా చేతిలో ఫోన్ ఉంది కదా అని ఫోన్ కొట్టారు. మోసగాళ్ల వలలో పడ్డారు అమాయకులు. అలా సంప్రదించిన వాళ్లతో మరింత నమ్మకం కలిగించేలా మాట కలిపారు. బల్బులు ఫిట్ చేస్తే 15 నుంచి 20 వేల రూపాయల వరకూ సంపాదించవచ్చని నమ్మ బలికారు. నమ్మి అంగీకరించిన వారి నుంచి డబ్బు వసూలు చేశారు. అలా దాదాపు వెయ్యి మందిని ముగ్గులోకి దించారు.
Loan APPS: హెచ్చుమీరుతున్న రుణ యాప్‌ల ఆగడాలు.. బలైతున్న జీవితాలు
కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్‌కు చెందిన నాగ పుల్లయ్య కూడా 10 వేల రూపాయాలు సమర్పించుకున్నారు. కానీ ఆ తర్వాత మోసగాళ్లు మొహం చాటేయడంతో ఆయన ఈ నెల 12 వ తేదీన స్పందనలో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగిన ఐదుగురిని అరెస్టు చేశారు.
'కాలువ నరసింహులు నవభారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఓ సర్క్యూలేట్ చేశాడు. ఎల్ఈడీ బల్బులు తయారు చేసి ఇంచి నుంచి 10 వేల రూపాయలు సంపాదించవచ్చని నమ్మించాడు. రెండు రాష్ట్రాల నుంటి వెయ్యి మందిని మోసపోయారు. ఓ బ్యాంకు అకౌంట్‌ను సీజ్ చేశాము. ఆ అకౌంట్లో 18 లక్షల 60 వేల రూపాయలు ఉంది. ఈ కేసులో ఐదు మంది అరెస్టు చేశాము.'- శివ నారాయణ స్వామి, ఆదోని డీఎస్పీ
ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన వెయ్యి మందిని బల్బుల మాటున బురిడీ కొట్టించారు. మొత్తం 53 లక్షల రూపాయలు వసూలు చేశారు. నిందితులకు నకిలీ చిరునామాలు, సిమ్ కార్డులు ఇవ్వడంలో సహకరించిన ఇద్దరు కూడా కటకటాల పాలయ్యారు.
కుటుంబ అవసరాల కోసం.. ఫేక్ కరెన్సీ నోట్ల తయారీ.. కట్‌చేస్తే..!