కర్నూలులో ఆరు లక్షల జనాభా ఉంది. అధికారికంగా 46,511 వ్యక్తిగత కుళాయిలు, 1810 వీధి కుళాయిలు ఉన్నాయి. రోజూ 67.50-80 ఎంఎల్‌డీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కచ్చా మురుగు కాల్వలు నగరంలో 751 కి.మీ., పక్కా మురుగు కాల్వలు 520 కి.మీ. ఉన్నాయి. ప్రధానంగా పాత నగరంలో మురుగు కాల్వల్లోనే పైపులైన్లు దర్శనమిస్తున్నాయి. చాణక్యనగర్ కాలనీ, అశోక్‌నగర్, ఎన్‌ఆర్ పేట, ప్రేమ్ నగర్, ఏ,బీ-క్యాంపులలో మురుగు కాల్వల్లోనే తాగునీటి పైపులున్నాయి. ప్రధాన పైపులైన్ల వాల్వులూ డ్రెయిన్లలోనే ఉంటున్నాయి.
నంద్యాలలో...
నంద్యాల మున్సిపాల్టీలో 2.26 లక్షల జనాభా ఉంది. 100 ఎంఎల్‌డీ సామర్థ్యం గల రెండు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. 28,911 కుళాయిల ద్వారా ప్రతి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. ఓల్డ్‌టౌన్‌లోని అరుంధతీ నగర్, మాల్‌దార్ పేట, నడిగడ్డ, జగజ్జననీ నగర్, బొల్లెద్దుల వీధి, కురవ పేట, పెద్ద మార్కెట్, ఇస్లాంపేట, పీవీ నగర్, వివేకానంద సెంటర్, పాన్ పట్టీ, కోటా వీధి, ఉప్పరి పేట, తోటిలైన్, నూనెపల్లి, ఏకలవ్య నగర్ ప్రాంతాల్లో మురుగు కాల్వల్లోనే పైపులు వేశారు.
మురుగు కాల్వల్లోనే...
నందికొట్కూరు పరిధిలో 52 వేల మంది జనాభా ఉన్నారు. 9,872 కుళాయిల ద్వారా నిత్యం 3.5 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఎస్సీ కాలనీ, కళాశాల రోడ్డు, కురవ పేట, సుబ్బారావు పేట, సాయిబాబా నగర్‌లో మురుగు కాల్వల్లోనే తాగునీటి పైపులైన్లు ఉన్నాయి. ఆత్మకూరు మున్సిపాల్టీలో 3,900 కుళాయిలున్నాయి. రహమత్‌నగర్, పెద్దబజార్, కొత్తపేట, అర్బన్ కాలనీల్లో మురుగు కాల్వల్లోనే ఈ పైపులు ఉన్నాయి. డోన్ పరిధిలో ఇందిరా నగర్, కొత్తపేట, కొండపేట, చాకిరేవుమిట్ట, చిగురుమాను పేట, నెహ్రూనగర్, తారకరామనగర్, శ్రీరామ్‌నగర్ తదితర కాలనీల్లో తాగునీటి పైపులైన్లు మురుగు కాల్వల్లో వేయడంతో నీరు కలుషితమవుతోంది.
కలుషిత నీరే దిక్కు..
సుమారు 2 లక్షల జనాభా గల ఆదోనిలో 42 వార్డుల్లో ప్రతిచోటా తాగునీటి పైపులు లీకవుతున్నాయి. రోజూ 25 ఎంఎల్‌డీ నీటిని 20 వేల కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా ఓల్డ్‌టౌన్ పరిధిలోని 18 వార్డుల్లో సరఫరా అవుతున్న నీరు మురుగుతో కలుషితమవుతున్నాయి. ఇదే సమస్యపై అధికార పార్టీ నేతలు గతంలో ఫిర్యాదు చేశారు. కమిషనర్ దృష్టికి పలుమార్లు ఈ సమస్య వచ్చినా నిధుల్లేక పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆదోని మున్సిపాల్టీ పరిధిలో 2005లో వేసిన హెచ్‌డీపీఈ పైపుల ద్వారా తాగునీటి సరఫరా చేపట్టారు. సాంకేతికంగా ఎలాంటి పరిశీలన చేయకుండా పైపులు వేయడంతో...వాహనాల రద్దీతో, విద్యుత్తు సరఫరా అంతరాయాలతో ఒత్తిడికి పైపులు పగులుతున్నాయి. కొత్త పైపులు వేయకుండా వాటికే మరమ్మతులు చేపడుతున్నారు.
ఇదీ చదవండి:
బాధితుల రక్త నమూనాల్లో సీసం గుర్తింపు..: ఏలూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్