మాయమాటలు చెప్పి ఓ వృద్ధుడి వద్ద గుర్తుతెలియని వ్యక్తి బంగారు గాజులు అపహరించిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్లకు చెందిన సుబ్బారాయుడు బ్యాంకులో బంగారు గాజులను తాకట్టు పెట్టి రుణం తీసుకునేందుకు నంద్యాలకు వచ్చాడు. స్థానిక సంజీవనగర్ నుంచి వెళుతున్న సుబ్బారాయుడిని, సరస్వతినగర్ వాసినంటూ రఫీ పేరుతో ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.
మీ కుమారుడు బాగా తెలుసంటూ.. మీవద్ద బంగారం ఉన్న విషయం తనకు చెప్పాడంటూ వృద్ధుడిని నమ్మించాడు. మాటలు కలిపి అల్పాహారం తినిపించాడు. దొంగలుంటారు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ.... ఒకసారి గాజులను చూపించమన్నాడు. సుబ్బారాయుడు గాజులు చూపగా... వాటిని లాక్కొని ఆ వ్యక్తి పరారయ్యాడు. వాటి విలువ సుమారు 2 లక్షలు రూపాయలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. దీనిపై రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి