తుంగభద్ర నది పుష్కరాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి డిసెంబర్ 1వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రాష్ట్రాల ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తున్న అతి పురాతన నది తుంగభద్ర. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో వేర్వేరుగా ఉద్భవించిన తుంగ, భద్ర నదులు కూడ్లి అనే పట్టణం వద్ద తుంగభద్రగా రూపాంతరం చెందాయి. తెలుగు రాష్ట్రాల్లోని కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దు మీదుగా ప్రయాణించి సంగమేశ్వరం వద్ద తుంగభద్ర కృష్ణా నదిలో కలిసిపోతుంది.
శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటా 21 నిముషాలకు బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించిన తరుణాన పుష్కరుడు నదిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో మొదలయ్యే తుంగభద్ర పుష్కరాలు డిసెంబర్ 1 వరకు కొనసాగుతాయి. పుష్కరాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. కర్నూలు సంకల్‌బాజ్ పుష్కర ఘాట్‌వద్ద నిర్విహించే హోమంలో పాల్గొంటారు.
ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గినందున పుణ్యస్నానాలకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం పూజలు, పిండ ప్రదానాలకే అనుమతిచ్చింది. కేవలం నీటిని తలపై జల్లుకోవడం మాత్రమే చేయాలని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ-టికెట్ తీసుకోవాలని అన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఘాట్ల వద్దకు అనుమతిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తోందని... ధార్మిక సంస్థలు, భక్తులు సహకరించాలని మంత్రి వెల్లంపల్లి కోరారు.
ఇదీ చదవండి