కర్నూలు జిల్లాలో రెండవ దశ పంచాయతీ ఎన్నికలు.. నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో జరుగుతున్నాయి. మెుత్తం 13 మండలాలు, 240 పంచాయతీలు, 2,482 వార్డుల్లో ఎన్నికలు కొనసాగుతున్నయి. 57 సర్పంచ్, 933 వార్డులు ఏకగ్రీవం కావడంతో.. 183 సర్పంచు, 1549 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ స్థానాలకు 519 మంది, వార్డులకు 3,496 మంది అభ్యర్థుల పోటీపడుతున్నారు. ఈ ఎన్నికలకు 6 వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. 1964 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు.
వృద్ధులను తీసుకురావద్దు..
గడివేముల మండలం పెసరవాయిలో సహాయకులు వృద్ధులను తీసుకుని వెళ్లరాదంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ మండలానికి చెందిన వండుట్లలో 48 కొత్త ఓటర్లను అధికారులు చేర్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. కొలిమిగుండ్ల మండలం బి. ఉప్పలూరులో వార్డు సభ్యుడు, ఏజెంట్లపై బైండోవర్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలింగ్ రోజు బైండోవర్ కేసులు పెట్టటంపై స్థానికులు ఆందోళనకు దిగారు.
ప్రమాదకర పరిస్థితుల నడుమ పోలింగ్..
కోవెలకుంట్ల మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భవనం పాతది కావడంతో.. గతంలో పెచ్చులూడి పడ్డాయి. అదే గదిలో ప్రమాదకర పరిస్థితుల్లో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. దీనిపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం