పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి కరోనా కారణంగా ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆక్సిజన్ పడక కావాలంటే రూ.లక్ష డిపాజిట్ చేయాలని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. చేతిలో నగదు లేదు... ఫోన్‌పే, కార్డు స్వైపింగ్ చేస్తామన్నా ససేమిరా అన్నారు. దీంతో చేసేది లేక రోగిని కుర్చీలో కూర్చోబెట్టి ఏటీఎంల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. తెలిసిన బంధువుల నుంచి డబ్బులు తీసుకుని డిపాజిట్ చేసి రోగిని ఆసుపత్రిలో చేర్చారు. మరుసటిరోజు పరీక్షలు, మందులు వగైరా వాటికి సైతం నగదు చెల్లించమనడంతో అవస్థలు తప్పలేదు.
అన్నింటా అదే తీరు..
నగదు రహిత లావాదేవీలను ప్రైవేటు ఆసుపత్రుల్లో పాటించడం లేదు. ఓపీ నుంచి ఫార్మా మందుల వరకు నగదు ఇస్తేనే..! అంటున్నారు. జిల్లాలో 23 ప్రైవేటు ఆసుపత్రులకు కొవిడ్ సేవలందించేందుకు అనుమతులిచ్చారు. వీటిలో కొన్ని ఆసుపత్రుల్లో నగదు రూపంలో ఇవ్వనిదే వైద్య సేవలందడం లేదు. కారణం వసూలు చేస్తోన్న అధిక ధరలకు ఆధారం లేకుండా ఉండేందుకు ఈ తరహా వ్యాపారం మొదలు పెట్టారు. నిర్ణయించిన ధరలను మాత్రమే ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలకు వసూలు చేయాలని ప్రభుత్వం సూచించినా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు.
పనిచేయవు.. పనిచేస్తే నగదు ఉండదు
జిల్లాలో 477 బ్యాంకులు ఖాతాదారులకు సేవలందిస్తున్నాయి. లావాదేవీలకు అనుగుణంగా జిల్లాలో 583 ఏటీఎంలు ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండి, లావాదేవీలు అధికంగా ఉండే ఏటీఎంలో రోజుకు 10-20 లక్షల వరకు, సరాసరిన ఉండే ఏటీఎంలో రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలు, గ్రామాల పరిధిలో ఉన్నవాటిలో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల నగదు నిల్వ చేయాల్సి ఉంటుంది. కరోనా ఉద్ధృతి పెరిగిన తర్వాత గత కొన్ని రోజులుగా కొన్ని ఏటీఎంలలో నగదు నిల్వలు లేవు. మరోవైపు నగదు ఉంటే సర్వర్ సమస్యలతో మొరాయిస్తున్నాయి. వేసవి కావడంతో ఏసీలు పనిచేయని ఏటీఎంలలో సమస్యలు తలెత్తుతున్నాయి. బ్యాంకు మేనేజర్లు సాంకేతిక సమస్యలపై సమాచారం ఇచ్చినా నిపుణులు రావడంలో జాప్యమవుతోంది. ఖాతా నుంచి డ్రా చేద్దామని బ్యాంకులకు వెళితే రద్దీ ఎక్కువగా ఉంటోంది.
ఇదీ చదవండీ.. అంబులెన్స్‌లను హైదరాబాద్ తరలించే ప్రయత్నాల్లో ఉన్నాం : ఎమ్మెల్యే హఫీజ్