కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని... దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 26న దసరా సందర్భంగా... కర్రల సమరాన్ని నిర్వహించాల్సి ఉంది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి బన్ని ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కర్రల సమరం ఈ ఏడాది లేనట్లేనని అధికారులు చెబుతున్నారు. గతంలో కర్రల సమరంపై... పోలీసులు, అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి... హింసను అరికట్టాలని చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వలేదు.
ఉత్సవ నేపథ్యం..
జైత్రయాత్రగా బయలుదేరిన తమ ఇలవేల్పు మాళమ్మ మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను స్వాధీనం చేసుకోవటానికి రెండు వర్గాల ప్రజలు పోటీ పడతారు. ఈ క్రమంలో కర్రలతో యుద్ధం చేసుకుంటారు. ఇందులో పైచేయి సాధించిన వారు స్వామివార్లను తమ గ్రామానికి తీసుకెళ్తారు.
అందులో భాగంగానే... నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా, ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. ఇదే ఆచారం అనాదిగా వస్తోంది. దీనిని తిలకించేందుకు కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఇంతమందిని నిలువరించటం సాధ్యమయ్యే పనేనా అనేది సందేహంగా మారింది.
విస్తృత ప్రచారం..
కరోనా నేపథ్యంలో కర్రల సమరం జరగటం లేదన్న విషయాన్ని గ్రామాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, వివిధ ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులు భావిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ ఉత్సవాల్లో స్వామి అమ్మవార్ల కల్యాణం ముఖ్యమైనది కావటం వల్ల ఈ కార్యక్రమానికి అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు సహా మరికొందరు ముఖ్యమైనవారిని మాత్రమే కొండపైకి అనుమతించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేవరగట్టుకు వెళ్లే అన్ని మార్గాలను మూసివేస్తామని ఎవరినీ అనుమతించబోమని... ఆదోని ఆర్డీవో, డీఎస్పీలు చెబుతున్నారు.
తరతరాల సంప్రదాయం..
తరతరాల నుంచి వస్తున్న బన్ని ఉత్సవాన్ని రద్దు చేయటంపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఉత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటామని నిర్వహకులు హామీ ఇస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దసరా రోజు ఈ ఉత్సవం ఏ విధంగా జరుగుతుందో వేచి చూడాలి.
ఇదీ చూడండి: