కర్నూలు నుంచి పోతుదొడ్డి వరకు 85 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మే 11న అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు జీపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది తెలంగాణ వాసులు మృతి చెందారు. ఈ కూడలి వద్ద ప్రమాదాలకు రహదారి నిర్మాణంలో ఇంజినీరింగ్ లోపమే కారణమని రవాణా శాఖ అధికారుల విశ్లేషణలో తేలింది. ఈ విషాదకర ఘటన అనంతరం అధికారుల తీరులో మార్పు రాలేదు. ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేకంగా చర్యలేమీ తీసుకోలేదు. ఆ కూడలి వద్ద ఓ కానిస్టేబుల్‌ను పెట్టి చేతులు దులుపుకుంది. చిన్నటేకూరు సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
నిర్వహణకు నీళ్లు వదిలేసిన అధికారులు
జాతీయ రహదారిపై ఎక్కడ ప్రమాద సూచికలు , స్పీడ్ బ్రేకర్లు లేవు. హైవే దాటే గ్రామాల వద్ద మలుపులు ఎక్కువగా ఉండి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకరమైన 9 మలుపులను అధికారులు గుర్తించారు. ప్రమాదాల నివారణకు పలుమార్లు సర్వే చేశారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెల్దుర్తి వద్ద అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. గత 20 రోజుల వ్యవధిలో 20 మంది మృతి చెందారని అంచనా.
వసూళ్లు మాత్రం పక్కాగా
కర్నూలు జిల్లా నుంచి వెళుతున్న 44వ నంబరు జాతీయ రహదారిలో 50 కిలోమీటర్లకు ఒక టోల్గేట్ ఉంది. ఇవి వాహనదారుల నుంచి ఏటా 60 కోట్లకు పైగా రుసుములు వసూళ్లు చేస్తున్నాయి. కానీ రహదారి నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదు. రహదారిపై గోతులు ఉన్న పట్టించుకోవడం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.