కర్నూలు జిల్లాలో కిలో ఉల్లి ధర రూ.80కు చేరింది. జిల్లాలో మూడు రైతు బజార్లు, ఆదోనిలోని ఒక రైతు బజార్‌లో ఉల్లి కేంద్రాలు ప్రారంభించారు. కేజీ రూ.40 చొప్పున మార్కెట్ సిబ్బందితో విక్రయాలు చేపట్టారు. ఈ ఉత్పత్తులను మహారాష్ట్ర నుంచి నేరుగా జిల్లాకు 50 టన్నులు దిగుమతి చేసుకున్నారు. ఇందులో ఆదోనికి 19 టన్నులు కేటాయించగా, మిగిలింది కర్నూలులోని రైతు బజార్లలో పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. మొదట్లో ఒక్కొక్కరికి కేజీ మాత్రమే పంపిణీ చేయగా, ప్రస్తుతం ఉల్లి దెబ్బతింటోందన్న కారణంగా, సరకు వెంటనే అమ్మేందుకు.. ఒక్కొక్కరికి 2-3కేజీల వరకు ఇవ్వాలంటూ అధికారులు ఆదేశాలిచ్చారు.
సి-క్యాంపు రైతు బజారుకు 31 టన్నుల ఉల్లి దిగుమతైంది. ఇందులో 45-50కేజీల తూకం ఉన్న బస్తాలున్నాయి. ఒక్కో బస్తాకు ఎంత లేదన్నా 8-10కేజీల వరకు ఉల్లి కుళ్లిపోయింది. ఇది గమనించకుండా బస్తాల్లోనే ఉల్లి ఉంచడంతో చాలావరకు సరకు దెబ్బతింది. ప్రస్తుతం సి-క్యాంపు రైతు బజార్‌లో ఉల్లిని ఆరబోసి గ్రేడింగ్ చేసి వినియోగదారులకు ఇస్తున్నప్పటికీ ఉల్లి వాసన వస్తుందని, మెత్తబడి కుళ్లిపోతుందని కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కొందామంటే కిలో రూ.80 వరకు ధర పలుకుతోంది. దెబ్బతిన్న ఉల్లిని రైతు బజార్‌లో కొనలేక, బహిరంగ మార్కెట్‌లో ధర పెట్టలేక వినియోగదారులు సతమతమవుతున్నారు.
వెంకటరమణ కాలనీలో అయితే బస్తాల్లోనే ఉల్లి 80శాతం దెబ్బతినడంతో ఉల్లి కేంద్రమే ప్రారంభించని దుస్థితి నెలకొంది. దెబ్బతిన్న ఉల్లిని ఆరబెట్టి గ్రేడింగ్ చేస్తే బస్తాలో ముప్పావు వంతు ఉల్లిగడ్డలు దెబ్బతిన్నాయి. సుమారు రూ.70వేల సరుకు పాడైనట్లు ఎస్టేట్ అధికారి హనుమంతరావు తెలిపారు.
ఇదీ చదవండి: