నల్లమల అడవులకుండే ప్రత్యేకతలేంటి? ఇక్కడ ఏ వృక్షజాతులు ఉంటాయి? అడవుల్లో సంచరించే జంతువులు, పక్షులు ఏంటి? అనే విషయాలపై చాలామందికి ప్రశ్నలుంటాయి. వీటన్నింటికి తుమ్మలబైలు ఏకో టూరిజం సఫారీ సమాధానమిస్తోంది. డోర్నాల నుంచి శ్రీశైలం దేవాలయం వెళ్లే ఘాట్ రోడ్డులో తుమ్మలబైలు వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తోందీ సఫారీ. సహజసిద్ధంగా పెరిగే వృక్ష జాతులు ఈ సఫారీలో కనిపిస్తాయి.
తుమ్మలబైలు ఏకో టూరిజం సఫారీలో వాహనాల్లో కూర్చొని సుమారు 2గంటలపాటు అడవిలో పర్యటించొచ్చు. క్రూర మృగాలు కనిపించకపోయినా.. వాటి అడుగులు కనిపిస్తాయి. రోజూ రాత్రి పూట నీళ్లు తాగేందుకు ఈ ప్రాంతానికి పులులు వస్తుంటాయి. ఆ చెరువును పులి చెరువుగా పిలుస్తారు. అరుదైన వృక్షాలు, వాటి ఉపయోగాలు అటవీశాఖ సిబ్బంది వివరిస్తారు.
ప్రారంభంలోనే పులుల బొమ్మలతో, పుట్టలు, చెట్లతో స్వాగతం పలుకుతోంది తుమ్మలబైలు ఏకో టూరిజం. ఇక్కడ చిన్నపాటి మ్యూజియం ఏర్పాటు చేశారు. పులులు, ఇతర అటవీ జంతువులు అడవిలో పర్యటించినప్పుడు కెమెరాకు చిక్కిన చిత్రాలు ప్రదర్శించారు. పర్యావరణంపై అవగాహన, నల్లమల అటవీ విశేషాలన్నీ తెలిపేందుకు ఈ ఏకో టూరిజం ప్రాజెక్టు ప్రారంభించామని అటవీశాఖాధికారులు పేర్కొంటున్నారు.