Swami AI Chat Bot: సాంకేతిక రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ శబరిమల మణికంఠుడి సేవలో తరిస్తుంది. భక్తులతో పాటు కృత్రిమ మేధ కూడా స్వామియే శరణం అయ్యప్ప అంటుంది. మకర జ్యోతి దర్శనం వరకు శబరిమలలో విపరీతమైన రద్దీ ఉండనున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం భక్తుల సౌకర్యంకోసం ఏఐ చాట్‌బాట్‌ని అందుబాటులోకి తెచ్చింది. స్వామి దర్శనం, ఇతర సేవలు, వసతి వంటి సదుపాయులు పొందేందుకు కేరళలోని పథనంతిట్ట జిల్లా కలెక్టర్ దీనిని ప్రారంభించారు.
యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో రూపకల్పన: శబరిమల హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన దివ్య క్షేత్రం. రోజురోజుకీ ఈ కొండకు వెళ్లే భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో భక్తుల సౌకర్యార్థం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహకారంతో పథనంతిట్ట జిల్లా కలెక్టర్ ఓ చాట్‌బాట్‌ని అందుబాటులోకి తెచ్చారు. ముత్తూట్ గ్రూప్‌తో కలిసి తీసుకొచ్చిన అత్యాధునికి ఈ చాట్‌బాట్ భక్తులకు రియల్ టైమ్ సమాచారంతో పాటు, వారి సందేహాలకు సమాధానం అందించనుంది. అన్ని వర్గాల ప్రజలు సులభంగా ఉపయోగించేలా దీనిని యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్‌తో రూపొందించారు. ఇంగ్లిష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఇది సమాచారం అందిస్తోంది.
ఎంతో రుచికరమైన శబరిమల "అరవణ ప్రసాదం" - ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!
చాట్‌బాట్‌తో భక్తులకు రియల్ టైమ్ సమాచారం: ఈ చాట్‌బాట్ ద్వారా ఆలయం తెరిచే సమయం, ప్రసాదం, పూజా సమయాలు వంటి సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. సమీపంలోని దేవాలయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్‌స్టాప్‌ల వివరాలనూ అందిస్తుంది. యాత్రకు వెళ్లేందుకు ఉత్తమ మార్గాలు, శబరిమలలో ఎక్కడ ఉండాలి వంటి ప్రశ్నలకు సమాధానమిస్తుంది. యాత్రలో ఎదురయ్యే సమస్యలకు సైతం తక్షణ పరిష్కారాలు అందిస్తుంది. మండలం, మకరజ్యోతి సీజన్‌లో శబరిమలకు అయ్యప్ప భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
అలాంటి సమయంలో ప్రమాదాలు ఏవైనా జరిగినా, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఓ సేఫ్టీ టూల్‌ని దీనిలో పొందుపరిచారు. దాని ద్వారా పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, మెడికల్, ఫారెస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఒకేసారి సమాచారం అందించవచ్చు. దీంతో అనుకోని ఘటనలు జరిగినప్పుడు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు భక్తులకు ఆధ్యాత్మికంగా ఉత్సహం కల్పించేందుకు భక్తి గీతాలు, స్తోత్రాలను సైతం పొందుపరిచారు.
ఏఐతో సులభంగా శబరిమల సేవలు: ఆధ్యాత్మికతకు సాంకేతికతను అనుసంధానించడంతో ఈ స్వామి చాట్‌బాట్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత సులభతరం చేయడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తోంది. మరోవైపు దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు కేరళ సర్కార్ యత్నిస్తోంది. భవిష్యత్తులో వివిధ భాషల్లో ఈ చాట్‌బాట్‌ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఇంతకీ ఏఐ సేవలు ఎలా పొందాలంటే: స్వామి ఏఐ చాట్‌బాట్ కోసం 6238008000 నెంబర్‌కి వాట్సాప్‌లో Hi (హాయ్) అని పెట్టగానే వెంటనే రిప్లై వస్తుంది. ముందుగా మనం లాంగ్వేజ్‌ని సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మనకు కావలసిన సేవల లిస్ట్ చూపిస్తుంది. అక్కడ నుంచి మన అవసరానికి అనుగుణంగా ఆప్షన్లను ఎంచుకోవాలి.
శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్ - ఇరుముడికట్టులో ఆ వస్తువులు తేవొద్దని బోర్డు విజ్ఞప్తి