గ్రామ కార్యదర్శికి.. జీవో నెం 149 ప్రకారం.. సచివాలయ సిబ్బందికి మెమో జారీ చేసే అధికారం ఉందని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి అసోసియేషన్ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి అన్నారు. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తెస్తే.. దాన్ని నిర్వీర్యం చేయడానికి రెవెన్యూ వ్యవస్థ పూనుకుందని మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మూడు రోజులుగా సచివాలయ వీఆర్వో, గ్రామ పంచాయతీ అధికారుల మధ్య వివాదం జరుగుతోంది. బసపురం సచివాలయం వీఆర్వో.. గ్రామంలో విధులకు సరిగా రావడం లేదని.. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి మెమో ఇచ్చారు.
పంచాయతీ కార్యదర్శి చంద్రకళ.. గ్రామ సచివాలయ రెవెన్యూ అధికారికి మెమో ఇవ్వటంతో రెవెన్యూ సంఘం నాయకులు తప్పుబట్టారు. పంచాయతీ కార్యదర్శికి వీఆర్వోకు మెమో ఇచ్చే అధికారమే లేదని రెండురోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జీవో ఎంఎస్ 149 ప్రకారం మెమో ఇచ్చే అధికారం పంచాయతీ కార్యదర్శికి ఉందని.. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు తెలిపారు. వీఆర్వో నుంచి సమాధానం రాకపోతే.. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గురుస్వామి, కార్యదర్శులు విజయలక్ష్మి, నాగరాజు, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...