Ketavaram Caves: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి సమీపంలో అందమైన ముగ్గురాళ్ల ఎర్రకొండలు ఉన్నాయి. ఈ కొండ గుహల్లో ఆదిమానవులు జీవించారనటానికి ఆనవాళ్లున్నాయి. పెద్దపెద్ద రాళ్లపై ఆదిమానవులు గీసిన గుర్రం, జింక, ఎద్దులు వంటి వివిధ జంతువుల చిత్రాలున్నాయి. ఆదిమానవుల లిపి సైతం ఉంది. ఈ లిపి, చిత్రాల ద్వారా తమ ఉనికిని భవిష్యత్ తరాలకు చాటి చెప్పారు. 1960లో అప్పటి కర్నూలు కలెక్టర్ కాశీపాండే వీటిపై పరిశోధనలు చేశారు. ఈ పురావస్తు, చారిత్రక సంపదను వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి చూపించారు.
ప్రాచీన రాళ్లపై ఉన్న లిపిని, చిత్రాలను రక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు ఎవరూ వీటిపై పెద్దగా దృష్టి సారించకపోవటంతో... నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొంత కాలం పర్యాటకశాఖ వీటిని సంరక్షించింది. సందర్శకులు తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. సుమారు 93 లక్షల రూపాయలు ఖర్చు చేసి రెస్టారెంట్, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. కానీ కొన్నేళ్లుగా వీటి సంరక్షణను గాలికి వదిలేసింది. రెస్టారెంట్ నిరుపయోగంగా మారింది.
ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. వీటికి తోడు ఆకతాయిలు రాళ్లపై పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు. అయినా ఎవరూ వీటిని అడ్డుకోవటం లేదు. తాజాగా ఈ గుహల సమీపంలోనే... సిలికా క్వారీ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. తవ్వకాలు సైతం జరుగుతుండటంతో... గుహలకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుహల ప్రాంతంలో తవ్వకాలు ఆపకపోతే... చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: