ప్రముఖ శైవక్షేత్రాల్లో కర్నూలు జిల్లాలోని యాగంటి క్షేత్రం ఒకటి. రవ్వలకొండలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆవులు కాస్తూ.. యాగంటిలోని శంకర గవిలో కూర్చొని కాలజ్ఞానం రాసినట్లు ఆధారాలున్నాయి. ఇక్కడి బసవన్న నంది విగ్రహం ఇరవైఏళ్లకోసారి అంగుళం పరిమాణంలో పెరుగుతూ ఉండటం విశేషం. ఇంతటి చరిత్ర ఉన్న ఈ పురాతన ఆలయానికి.. సమీపంలో గనుల కోసం జరుపుతున్న పేలుళ్ల్లతో ముప్పు పొంచి ఉంది. నంది విగ్రహం మోపురంపై పగుళ్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే బసవన్న మండపం పైకప్పు దూలం విరిగి కిందకు జారింది. ఆలయానికి సమీపంలో ఖనిజ సంపద కోసం జరుపుతున్న పేలుళ్లే ఇందుకు ప్రధాన కారణం.
కొండ భాగం పరిధిలో కొన్నిచోట్ల అనధికారిక తవ్వకాలు చేపడుతూ పేలుళ్లు జరుపుతున్నారు. యాగంటి సమీపంలో తవ్వకాలకు అనుమతులివ్వకూడదని కర్నూలు జడ్పీ సమావేశంలో 2017లో తీర్మానం చేశారు. ఈ కారణంతోనే ఆలయానికి 1.8 కి.మీ దూరంలో ఉన్న ఓ క్వారీ అనుమతులు పునరుద్ధరించలేమంటూ గనులశాఖ ఓ దరఖాస్తును తిరస్కరించింది. అలాంటిది ప్రస్తుతం అక్కడే ఓ సిమెంటు పరిశ్రమకు లైమ్‌స్టోన్ తవ్వుకోడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. ఆరేళ్ల క్రితం వేంకటేశ్వరస్వామి గుహలో పైభాగం కొంత కుప్పకూలింది. ఈ గుహకు వెళ్లే వంతెన సైతం పగుళ్లకు గురవుతోంది. వీటిపై ప్రభుత్వం దృష్టిపెట్టక పోవడం బాధాకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: