ఓ వైపు సంప్రదాయం..మరోవైపు కొవిడ్ నియమం. ఓ దిక్కు గ్రామస్థుల కట్టుబాట్లు ఇంకో దిక్కు పోలీసుల ఆంక్షలు. ఇలా కర్నూలు జిల్లా దేవరగట్టులో ఉత్కంఠ రేపిన బన్నీ ఉత్సవం ఎప్పటిలాగే యథావిధిగా జరిగిపోయింది.
విజయదశమి రోజున దేవరగట్టులో ఏటా బన్నీఉత్సవం ఆనవాయితీగా వస్తోంది. పోలీసులు అడ్డుకోవాలని చూడడం.. గ్రామస్థులు కర్రల సమరానికి దిగడం కూడా అలవాటైపోయింది. ఐతే..ఈసారి కరోనా నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. బన్నీ ఉత్సవాలకు అనుమతే లేదని విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. కర్ణాటక నుంచి వచ్చేవారికి రాకుండా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ ఆంక్షలేవీ భక్తుల్ని ఆపలేకపోయాయి. వందల మంది కాలినడకన దేవరగట్టు చేరుకుని ఉత్సవాన్ని నిర్వహించారు.
దేవరగట్టులో భక్తులదే పైచేయిగా నిలిచింది. అధికారుల ప్రయత్నంలో భాగంగా కర్రలు తీసుకురావడం తగ్గినా ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఎవరు రాకపోయినా 11 గంటల తర్వాత ఒక్కసారిగా జనం తరలి రావడంతో పోలీసులు వారిని నిలువరిచలేకపోయారు. రాత్రి 1.00 గం.లు సమయంలో స్వామి కల్యాణం తర్వాత ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. గట్టు పైన దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకుని సింహాసనం కట్ట వద్దకు అక్కడి నుంచి పాదాల కట్ట, రాక్షస పడ, అక్కడి నుంచి శమీ వృక్షం దగ్గరకు చెరి అక్కడ పూజలు చేసుకొని తిరిగి సింహాసనం వద్దకు చేరడంతో బన్నీ ఉత్సవం ముగుస్తుంది. ఈ బన్నీ ఉత్సవంలో కర్రలు తగిలి, దివిటీల కాలి దాదాపు 50 మంది దాకా గాయాలపాలయ్యారు.
.
ఇదీ చదవండి : పోలవరం 'డ్యామ్' నిర్మాణానికే నిధులు: కేంద్రం