Telangana Congress dispute:తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ను గాడిన పెట్టేందుకు ఏఐసీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండేళ్లకు పైగా తెలంగాణ ఇన్‌ఛార్జిగా ఉన్న మాణికం ఠాగూర్‌ను తప్పించి.. ఆ స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్‌రావు ఠాక్రేను నియమించింది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పినట్లు వింటూ.. సీనియర్లను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఠాగూర్‌ను తప్పించినట్లు సమాచారం.
తెలంగాణ నుంచి తప్పించిన ఠాగూర్‌కు గోవా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఖర్గే ప్రత్యేక దృష్టిసారించడంతో.. త్వరలో దిల్లీలో లేదా హైదరాబాద్‌లో పీసీసీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారని విశ్వసనీయ సమాచారం. కొత్త కమిటీల నియామకం సహా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శించారు. రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ వైఖరిని తప్పుపట్టడంతోపాటు రేవంత్‌కి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.
Manik Rao Thackeray incharge of Congress affairs: ఈ తరుణంలో అధిష్ఠానం దూతగా ఏఐసీసీ సీనియర్‌నేత దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ వచ్చి.. కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. డిగ్గీరాజా ఇచ్చిన నివేదికపై చర్చించిన అధిష్ఠానం.. కొత్త ఇన్‌ఛార్జిని నియమించింది. 2020 సెప్టెంబరు 12న రాష్ట్ర ఇన్‌ఛార్జిగా నియమితులైన మాణికంపై.. పలువురు సీనియర్ నేతలు మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకంతో సీనియర్ నేతలు, ఠాగూర్ మధ్య అంతరం మరింత పెరిగింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. పదవుల్ని, ప్రాణాలను త్యాగం చేయడానికి తాను సిద్ధమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదవిలో ఉన్నా.. లేకున్నా పార్టీ కోసం పని చేస్తానన్నారు. అధిష్ఠానం ఎవరికి బాధ్యతలిచ్చినా వారిని భుజాలపై మోస్తానన్నారు. పీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఈమేరకు వ్యాఖ్యానించారు. సమస్యలుంటే సర్దుకుందాం, ఎలాంటి భేషజాలకు పోకుండా కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా’నని స్పష్టంచేశారు.
Revanth Reddy comments: ఒకట్రెండు తప్పులు జరిగి ఉండవచ్చు.. వాటిని మనసులో పెట్టుకోకుండా.. మాట్లాడుకుని పరిష్కరించుకుని ముందుకు పోదామని రేవంత్ అన్నారు. మోసపూరిత హామీలతో అన్నివర్గాలకు అన్యాయం చేసిన కేసీఆర్‌ను ఉప్పెనలా కమ్మేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. పోలవరంపై కేసీఆర్ వైఖరి స్పష్టం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు, గోదావరి, కృష్ణాజలాలు, ఏపీ తెలంగాణ ఆస్తుల పంపకాల విషయాల్లో ఏపీ వైపు ఉంటారా? తెలంగాణ వైపు ఉంటారో చెప్పాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ రెవెన్యూ విధానానికి అతిపెద్ద ప్రమాదకరమని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. దిల్లీలో పార్లమెంటరీ కమిటీ భేటీకి వెళ్లడం వల్ల ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాహుల్ పాదయాత్రలో పాల్గొనడం కారణంగా సీతక్క సమావేశానికి రాలేదు. ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలతోపాటు మహేశ్వర్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, అజారుద్దీన్ తదితరులు హాజరుకాలేదు.
ఇవీ చదవండి: