రాయలసీమ ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు లేఖ రాయడం పట్ల భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలులో జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతం కోసం వైకాపా, తెదేపా నాయకులు సమిష్టిగా పోరాటం చెయ్యాల్సిన సమయంలో ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విధంగా ఉందన్నారు. తమ ఎమ్మెల్యేల లేఖపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. శ్రీశైలం జలాశయం వద్ద తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులతోపాటు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులతో ప్రకాశం జిల్లా రైతులు, ప్రజలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు జిల్లాకు నీటిని అందకుండా చేయొద్దని కోరారు.
ఇదీ చదవండి:
రాయలసీమ ఎత్తిపోతలపై తెదేపా ఎమ్మెల్యేల అభ్యంతరం... సీఎం జగన్‌కు లేఖ!