రాష్ట్రంలో వైకాపాకు పోటీ భాజపానే అని ఆ పార్టీ రాయలసీమ బాధ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆళ్లగడ్డ పట్టణంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా వైకాపాకు ప్రధాన పోటీదారు తమ పార్టీనే అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోలీసులు బెదిరించి రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు జీతాలు తీసుకుంటున్నది ప్రభుత్వ ఖజానా నుంచి తప్ప వైకాపా నుంచి కాదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రంలోని ఇతర పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విష్ణు విమర్శించారు. ప్రత్యేక హోదా కావాలంటున్న వైకాపా నాయకులు ఆ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించకుండా, తమ పార్టీ ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు ఇస్తున్నారన్నారు. గత ఏడేళ్ల కాలంలో అటు తెదేపా... ఇటు వైకాపాలు అధికారంలో ఉండి రెండున్నర లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టారన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీగా తమ పార్టీని ప్రజలు భావిస్తున్నారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అక్కడ 40 ఏళ్లుగా ఎన్నికలు లేవు..!