Adoni YSRCP Leaders Land Irregularities : ఆయన కర్నూలు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి. ఆయన ప్రవృత్తి మాత్రం అక్రమార్జన. ఇందుకోసం దేన్నీ వదలని పరిస్థితి. ముందుగా ఆయన కన్ను భూములపై పడింది. క్రమంగా అది తారాస్థాయికి చేరింది. పంచాయితీ చేశారంటే ఆ ఆస్తి ఆయనకో, అనుచరులకో రావాల్సిందే. సెటిల్‌మెంట్లనే ప్రధాన ఆదాయవనరుగా మార్చుకున్న సదరు నేత కోట్ల విలువ చేసే భూములు సెటిల్ చేసి, తానే రాయించుకుంటారు. ఈ సెటిల్‌మెంట్లను తన దగ్గరకు తెచ్చేందుకు 20 మంది ఏజెంట్లను పెట్టుకున్నారు.
తిరగబడితే.. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు : కర్నూలు జిల్లా ఆదోని చుట్టుపక్కల సమస్యాత్మకంగా ఉన్న భూములపై వాలే ఈ సైన్యం బాధితులను సదరు నేత దగ్గరికి పంపిస్తారు. ఎలాంటి సమస్యా రాకుండా సైన్యంలోని ప్రధాన అనుచరుడు ముందుగా తమ మనుషుల్లోని SCలను బాధితుల వద్దకు పంపి ఆ భూమిని తమకే అమ్మేయాలని బెదిరిస్తారు. వారిపై బాధితులు తిరగబడితే తిరిగి వారిపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయిస్తామని భయపెడతారు. అలా భూములు స్వాధీనం చేసుకుని, వెంచర్లు వేసి విక్రయిస్తారు. దందాపై బాధితులు స్టేషన్‌కు వెళ్తే పోలీసులే వారిని ఆ ప్రజాప్రతినిధి వద్దకు పంపుతున్న పరిస్థితి.
వైసీపీ నేతల భూ దాహానికి బలైన యువకుడు - రాష్ట్రంలో తీవ్ర కలకలం!
Ruling Party Land Grabs in Andhra Pradesh : ఆదోని శివారు మండిగిర పంచాయతీ తిరుమలనగర్‌లో ఒక వెంచర్‌లో పార్కు కోసం వదిలిన 72 సెంట్ల స్థలాన్ని పంచాయతీ భూమి అని గతంలోనే బోర్డు పెట్టారు. ఇప్పుడు దాన్ని తొలగించి, ప్లాట్లుగా మార్చి అమ్మకానికి సిద్ధం చేశారు వైసీపీ నేతలు. ఇక్కడ సెంటు 10 నుంచి 15 లక్షల వరకు పలుకుతోంది. అంటే భూమి విలువ సరాసరి 8 నుంచి 10 కోట్లు. దీనిపై స్థానికులు జేసీకి ఫిర్యాదు చేయగా, వారిని ఆ ముఖ్య ప్రజాప్రతినిధి తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆ భూమి తమ వాళ్లదేనని, వాళ్లు కోర్టులో కేసు వేశారని అవసరమైతే మీరూ కోర్టుకు వెళ్లండని హెచ్చరించినట్లు సమాచారం.
YCP Leaders Land Irregularities in Adoni : ఆదోని శివారులోని 352 సర్వే నంబరులో దాదాపు 4.54 ఎకరాల్లో 1992లో ఇద్దరు వ్యక్తులు వెంచర్ వేసి, కొందరికి ప్లాట్లు కేటాయించారు. తర్వాత వీరు ఆ ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్లు చేయించగా భూమి తమదేనంటూ 424 మంది బయటకొచ్చారు. పంచాయితీ ఆ ప్రజాప్రతినిధి వద్దకు రాగా బాధితులకు సెంటుకు లక్ష చొప్పున నామమాత్రపు ధర చెల్లించి లాక్కున్నారు. అదే భూమిని సెంటు 8నుంచి 10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మండిగిరి పంచాయతీలో శాంతి అనే మహిళకు చెందిన 70 సెంట్ల భూమిని ఆక్రమించుకొని వెంచర్ వేశారు. ప్రశ్నిస్తే ఆ మహిళ కుటుంబానికి నామమాత్రపు ధర చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ప్రశ్నిస్తే 'దుస్తులూడదీసి కొడతాం' - సామాన్యుల ఆస్థులు ఆక్రమిస్తూ వైసీపీ నాయకుల బెదిరింపులు
Land Grabs in Kurnool :ఆదోని కేంద్రంగా పెద్ద ఎత్తున సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులకు ఆ ప్రజాప్రతినిధి అండ ఉంది. గత మేలో జరిగిన IPL సందర్భంగా పోలీసులు ఆరుగురు నిర్వాహకులను అరెస్టు చేసి 80 లక్షల నగదు, ఒక స్కార్పియో, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక నిర్వాహకుడిని వదిలిపెట్టాలని ప్రజాప్రతినిధి చెప్పినా వినలేదని సీఐని వీఆర్‌లోకి పంపేశారు. ఆ నిర్వాహకుడు ప్రపంచకప్‌పైనా బెట్టింగులు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనిపై ఇప్పటి వరకూ 10కిపైగా కేసులున్నా ఆ ప్రజాప్రతినిధి వెంట పార్టీ కార్యక్రమాల్లో యథేచ్ఛగా పాల్గొంటున్నారు.
Land Irregularities in Andhra Pradesh : ఆదోనిలో దాదాపు 40 మంది మట్కా నిర్వాహకులు ఉన్నారని పోలీసుల అంచనా. ఒక్కొక్కరు రోజూ 20 వేల నుంచి లక్ష వరకు ఆడిస్తున్నారు. ప్రతి నిర్వాహకుడి నుంచి నెలవారీ మామూళ్లు ప్రజాప్రతినిధి భార్యకు వెళ్తాయి. సదరు నేత అనుచరుల్లో కొందరు కర్ణాటక అక్రమ మద్యం రవాణా, విక్రయిస్తున్నా పోలీసులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. ఎప్పుడైనా తన అనుచరులను పట్టుకుంటే వెంటనే వారిని విడిచిపెట్టాలని నేత పోలీసులకు ఫోన్లు చేస్తారు. ఆదోని సబ్ డివిజన్ ఏఎస్పీగా అధిరాజ్‌సింగ్ రాణాను గత మేలో ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టి పూజలు చేసిన అరగంటలోనే హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు. డీఎస్పీ స్థానంలో ఐపీఎస్ అధికారి ఉంటే తమకు కష్టమని అప్పటికప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి వైకాపా ముఖ్యనేతకు చెప్పి బదిలీ చేయించారు.
YSRCP Leaders Son Irregularities : కుమారుడు సైతం తండ్రి బాటనే ఎంచుకున్నారు. రేషన్ బియ్యం రవాణాలో ఈ ప్రజాప్రతినిధి వారసుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ దందా నిర్వహణకు ఒక సిండికేట్‌ను ఏర్పాటు చేయించారు. ఆ సిండికేట్ బియ్యాన్ని కర్ణాటక వంటి ప్రాంతాలకు తరలిస్తోంది. అధికారులు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ముందే చూసుకుంటున్నారు.
ఒంగోలులో కొనసాగుతున్న భూకబ్జాలు - నకిలీ స్టాంపులు, అక్రమ రిజిస్ట్రేషన్లతో మోసాలు