Crime News in AP: అభం శుభం తెలియని బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని జోహరాపురం ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ఫైరోజ్ అలియాస్ జిలేబీ బాషా (25) మిఠాయి దుకాణంలో పని చేస్తున్నాడు. గురువారం ఫూటుగా మద్యం సేవించిన అతడికి.. ఓ బాలికపై కన్ను పడింది. దీంతో బాలిక తమ్ముడికి 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ తెచ్చుకోమని పంపాడు. అనంతరం బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక ఏడ్చేసరికి అతడు ఆమెను వదిలిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి ఒకటవ పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో, ఇతర చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించిన బాలుడుకి ఏడాది జైలు శిక్ష
మరోవైపు అనకాపల్లి జిల్లాలో నాలుగేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బాలుడి(14)కి ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీంతో పాటు అతడికి పదివేల రూపాయల జరిమానా విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కసింకోట మండలంలో 2020 సంవత్సరంలో ఉగ్గిన పాలెంలో ఓ బాలుడు అదే గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిని తన ఇంటికి తీసుకుని వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గురించి ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం విశాఖ జువైనల్ కోర్టు జడ్జి కే.వీ.ఎల్ హేమ బిందు బాలుడికి ఏడాది పాటు జైలు శిక్ష, పదివేల జరిమానా విధించారు. అనంతరం బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు కసింకోట ఎస్సై తెలిపారు.
లారీని ఢీకొన్న బస్సు.. 8 మందికి గాయాలు..
లారీనీ ఓవర్టేక్ చేయబోయిన మరో లారీని వెనకనుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. పల్నాడు జిల్లాలోని వినుకొండ మండలంలో జరిగిన ఈ ఘటనలో క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాకినాడ నుంచి మంత్రాలయం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. విఠంరాజుపల్లె గ్రామ శివారులోని బాలాజీ ఎస్టేట్ ఎదురుగా గుంటూరు నుంచి శనగల లోడుతో వినుకొండ వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. శుక్రవారం రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయాలైన ఎనిమిది మందిని అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. వీరిలో బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ అయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇవీ చదవండి: