YSRCP factions attacked BJP leaders : అమరావతిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు బరితెగించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై దాడికి తెగబడ్డారు. అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపైనా దాడులతో రెచ్చిపోయారు.
రాజధాని రైతుల 12వందల రోజుల సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారును అడ్డుకున్నారు. ఆ తర్వాత కారు అద్దాలు పగులగొట్టారు. దాడిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోవడంతో.. జాతీయ నేత సత్యకుమార్ భద్రతపై బీజేపీ నాయకులు ఆందోళన చెందారు. ఆయన్ను రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చాలాసేపటి తర్వాత అక్కడి నుంచి సత్యకుమార్ ముందుకు సాగిపోయారు. ఉద్దండరాయునిపాలెంలో మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులే ఈ దాడికి దిగినట్లు బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘటన తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్... తన అనుచరులు నిర్వహిస్తున్న మూడు రాజధానుల శిబిరం వద్దకు వచ్చారు.
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. గుంటూరు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సత్యకుమార్.. దాడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భౌతికదాడులకు సిద్ధమని వైఎస్సార్సీపీ చెబితే తాము కూడా సిద్ధమే అని సత్యకుమార్ అన్నారు. భౌతిక దాడులు చేసి భయపెట్టాలని వైఎస్సార్సీపీ చూస్తోందని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమ కార్యకర్తలపై దెబ్బ పడితే మేమూ సమాధానం చెప్పగలం.. పోలీసులు లేకుండా ఘర్షణకు రండి.. తేల్చుకుందాం.. అని సవాల్ చేశారు. కొందరు తప్పించుకున్నారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారంటే.. దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని సత్యకుమార్ పేర్కొన్నారు. దాడులు చేయాలని ఎవరు చెప్పారో త్వరలోనే తేలుతుందని, ఇంత జరిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. దాడికి దిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పోలీసులు సహకరించారని ఆరోపించారు. అధికార పార్టీకి తొత్తులుగా మారవద్దని పోలీసు అధికారులను కోరుతున్నా.. దాడికి ప్రయత్నించిన వారిపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని సత్యకుమార్ కోరారు. దాడి ఘటనను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఎంపీ నందిగం సురేష్ డైరెక్షన్లోనే.. తనపై దాడులకు ప్రయత్నించారని సత్యకుమార్ ఆరోపించారు. అమరావతి రైతులకు మద్దతిచ్చామనే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని, స్థానికేతర ఎంపీ నందిగం సురేశ్‌కు అక్కడ ఏం పని? అని సత్యకుమార్ ప్రశ్నించారు. ఆదినారాయణరెడ్డిని టార్గెట్ చేశారని తెలుస్తోందని చెప్పారు. ఆదినారాయణరెడ్డి తప్పించుకున్నారని ఎంపీ అన్నారంటే అర్థం ఏమిటని సత్యకుమార్ ప్రశ్నించారు. ఆదినారాయణరెడ్డి మీద కూడా గొడ్డలిపోటు పడేదా? అని అనుమానం వ్యక్తం చేశారు. దాడి వెనుక ఎంపీ సురేశ్ ఉన్నారని... ఆయనపై విచారణ జరపాలి డిమాండ్ చేశారు. దాటికి ముందే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని చెప్పిన సత్యకుమార్... ఘటనపై కేంద్ర నాయకత్వం సీరియస్‌గా ఉందని తెలిపారు.
ఇవీ చదవండి :