లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలో మద్యం ధరలు పెంచటంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కృష్ణాజిల్లా రాష్ట్ర సరిహద్దు కావటంతో తెలంగాణ నుంచి మద్యాన్ని సులువుగా రాష్ట్రంలోకి తెస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచటంతో అక్రమ రవాణాకు కొత్త దారులు వెతుకుతున్నారు.
కంచికచర్ల మండలం దొనకొండ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద నందిగామ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా..అంబులెన్స్‌లో మద్యం తరలిస్తున్న ట్లు గుర్తించారు. 37 మద్యం సీసాలను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో చేపల ఆక్సిజన్ తరలించే వాహనంలో మద్యం రవాణా చేసేందుకు యత్నించారు. ఆక్సిజన్ ట్యాంక్‌లో 107 మద్యం సీసాలను గుర్తించిన అధికారులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
జొన్నలగడ్డ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో.. తెలంగాణ నుంచి నడక దారిన ఇద్దరు వ్యక్తులు గోనె సంచుల్లో తీసుకొస్తున్న 293 మద్యం సీసాలు బయటపడ్డాయి. వాటిని చూసి అధికారులు నివ్వెరపోయారు. అవి స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.
నూజివీడు మండలం సిద్ధార్థ నగర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా యాక్టివా ముందు భాగంలో మద్యం సీసాలను గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 341 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా తిరువూరు పోలీసులు తనిఖీలు చేపట్టగా పాల వ్యానులో మద్యం సీసాలను గుర్తించారు. ఖమ్మం జిల్లా మర్లకుంట నుంచి పాల క్యానులో మద్యం సీసాలను తిరువూరు తరలిస్తుండగా పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితుడిపై కేసులు నమోదు చేశారు.
ఇవీ చదవండి....