వారం రోజులుగా కృష్ణాజిల్లా వత్సవాయి మండలంలోని 30 గ్రామాలకు తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మున్నేరుకు వరద రావడంతో ఏటిలో ఉన్న తాగునీటి పథకాల మోటార్లు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయి. మండలంలోని 30 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మున్నేరులో లింగాల వద్ద ఉన్న మూడు రక్షిత నీటి పథకాల ద్వారా 13 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది.
అదేవిధంగా పోలంపల్లి , ఇందుపల్లి, ఖమ్మంపాడు రక్షిత పథకాలు ఆగిపోవడంతో మరో 17 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు మరమ్మతులు చేపట్టలేక చేతులెత్తేశారు. ఇదే అదునుగా భావించి నీటి శుద్ధి కేంద్రాల నిర్వాహకులు ధరలు పెంచారు. అధిక ధరలు వెచ్చించి తాగునీటిని కొనుగోలు చేయలేని పేద, మధ్యతరగతి ప్రజలు స్థానికంగా ఉండే చేతిపంపులు బావులపై ఆధారపడుతున్నారు. కలుషిత నీరు తాగుతూ.. రోగాల బారిన పడుతున్నారు. అధికారులు సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: