ఏ నగరానికి అయినా... పచ్చటి ఉద్యానవనాలే తోరణాలు. ఆ ప్రాంతంలోని నందనవనాలే... నగరం అందాలను ప్రతిబింబిస్తాయి. విజయవాడ నగరాన్ని... ఒక నందన వనంలా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ పూనుకుంది. కాలానికి అనుగుణంగా పెరుగుతున్న నగరీకరణను దృష్టిలో పెట్టుకొని... నగరం నలువైపులా పార్కులు అభివృద్ధి చేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నగర ప్రజలకు అందించేందుకు కోట్ల రూపాయల వ్యయంతో 26 పార్కులను అందులోబాటులోకి తెస్తోంది. నగరపాలక సంస్థకి చెందిన ఖాళీ స్థలాలు, చెత్తచెదారం వేసే ప్రాంతాలను గుర్తించి గ్రీన్ బెల్ట్ రూపంలో మార్చి అభివృద్ధి పార్కులు నిర్మిస్తోంది.
నగరంలోని సర్కిల్-1, సర్కిల్-2, సర్కిల్-3 మూడు నియోజకవర్గాల్లో కలిపి మెుత్తం 26 పార్కుల అభివృద్ధి పనులు ఉన్నాయి. ఈ పార్కులను సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సర్కిల్-1 పరిధిలో ఎకరంలో పార్కును ఆధునీకరించి ప్రజలు అందుబాటులోకి తెచ్చారు. ఈ పార్కుకు ప్రత్యేకంగా అక్కడే ఉన్న మురుగు నీటిని శుద్ధి చేసి అందిస్తున్నారు. సర్కిల్-1 పరిధిలోనే... సితార - గొల్లపూడి వద్ద గ్రీన్ బెల్డ్ కారిడార్ మాదిరిగా చెట్లను నాటి పార్కులా మార్చారు. ముఖ్యంగా గ్రీన్ బెల్ట్ ద్వారా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. లేబర్ కాలనీలోనూ మరో రెండు పార్కులు కూడా నగరపాలక సంస్థ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. కె. ఎల్ రావు పార్కు బోటింగ్ ఛానల్, స్కేటింగ్ రింగ్ సహా అనేక సదుపాయలు కల్పించారు.
సర్కిల్-2 లో ప్రధానంగా నగరంలో అతిపెద్ద పార్కును నిర్మిస్తున్నారు. ఒకప్పుడు కొండల్లా చెత్తనిండుకొనిపోయిన ప్రాంతాన్ని పూర్తిగా ఉద్యనవనం శోభ తెచ్చేందుకు నగరపాలక సంస్థ పనులు చేపట్టింది. ఇందుకోసం సుమారు 10 కోట్ల రూపాయలకుపైగా కేటాయించింది. ఈ పార్కుకు డంప్ సైడ్ పార్కు, ఐకానిక్ పార్కుగా నామకరణం చేశారు. ఇందులో వాకింగ్ ట్రాక్, పిల్లలకు ప్రత్యేకంగా ఆట స్థలం, పచ్చదనం కోసం వందల సంఖ్యలో మెుక్కల పెంపకం చేపట్టనున్నారు. అదే సర్కిల్-2 పరిధిలోని ప్రకాశ్ నగర్, రాజీవ్ నగర్ లోని వీర్లబాలరాజు పార్కును ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు.ప్రతి కాలనీ పార్కులు అభివృద్ధి, నగరాన్ని నందన వనంలా మార్చటమే తమ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఓ మోడల్ గా పార్కుల అభివృద్ధిని చేపట్టామని తెలిపారు.
సర్కిల్-3 అతిపెద్ద పార్కులైన రాఘవయ్య పార్కు, రాజీవ్ గాంధీ పార్కులను సమూలంగా మార్చేందుకు నగరపాలక సంస్థ నడుంబిగించింది. ఈ పార్కులను వాణిజ్య పార్కులుగా సుందరంగా తీర్చిదిద్దుతోంది. కృష్ణా నది తీరానికి సమీపంలో ఉండడంలో అధిక సంఖ్యలో పార్కుకి పర్యాటకులు, నగరవాసుల తాకిడి ఎక్కవ ఉన్నందున అహ్లాదభరితంగా తీర్చిదిద్దుతున్నారు. పనులు వేగంగా జరిగేందుకు కమిషనర్...వారం వారం పురోగతి సమీక్ష జరుపుతున్నారు. ఈ సర్కిల్-3 లో అమృత్ పథకం కింద ఇప్పటికే. నెల్సన్ మండెల్లా పార్కు బాగుచేశారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు నగరంలో 60 నుంచి 70 ఖాళీ లే అవుట్ స్థలాలను నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు.ఈ ప్రాంతాలన్నింటిలో చిన్న, పెద్ద పార్కులు, గ్రీన్ బెల్ట్ లు ఏర్పాటు చేశారు. చెత్తతో దుర్వాసన వెదజల్లే ప్రాంతాల్లోనూ పార్కులు అభివృద్ధి చేస్తూ పచ్చటి పర్యావరణాన్ని ప్రజలకు అందిస్తున్నారు.
ఇదీ చదవండి : ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 7 నుంచి దసరా ఉత్సవాలు..