విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో వైకాపా నేతలు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక కార్పొరేటర్ వైకాపా అభ్యర్థి చైతన్య రెడ్డితో కలిసి భవానీపురం, కొండవీడు అకాడమీ ప్రాంతాలలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. నాణ్యమైన నిబద్ధత గల యువత రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు.. ప్రత్యేకంగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇందుకు నిదర్శనమే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా తరపున అత్యధికంగా మహిళలు, విద్యావంతులు, యువత పోటీ చేయటమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. రాజకీయంగా, తన శాఖ పరంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికి దేవాలయాల పరిరక్షణలో వెల్లంపల్లి కంకణం కట్టుకున్నారని మంత్రి కన్నబాబు కితాబిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ నగరంలో వైకాపా జెండా రెపరెపలాడుతుంది అని మంత్రి కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అతివిశ్వాసం వద్దు.. మున్సిపల్ ఎన్నికల్లో మరింత కష్టపడాలి: సీఎం జగన్