సీఎం పేషీ ఆదేశాల మేరకే అమరావతి రైతులకు పోలీసులు బేడీలు వేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. పై అధికారుల ఆదేశాలు లేకుండా రైతులకు బేడీలు వేయరని.. అమాయకులైన ఏఆర్ కానిస్టేబుళ్లను బలిచేశారని అన్నారు. ఘటనకు నైతిక బాధ్యత వహించి డీజీపీ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
వైకాపా ప్రభుత్వం ఎస్సీల మీద యుద్ధం ప్రకటించిందని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. కృష్ణాయపాలం ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురిలో అయిదుగురు ఎస్సీ రైతులు అమరావతి కోసం భూమి ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే పోలీసు అధికారులు తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ వర్తించదని పోలీసులు.. సీఎం పేషీకి చెప్పలేకపోయారని వర్ల అన్నారు.
హోంమంత్రి రాజీనామా చేయాలి
అన్నం పెట్టే రైతులకు బేడీలు వేసే పరిస్థితి రావటం దారుణమని విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించటంతో పాటు తీవ్రంగా అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు బేడీలు వేయటాన్ని నిరసిస్తూ గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చేతులకు బేడీలు వేసుకుని విజయవాడలో ఆందోళన చెపట్టారు.
ఇదీ చదవండి:
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే: ఎన్జీటీ