రాష్ట్రంలో మద్యం మాఫియాను వైకాపా నేతలే పెంచి పోషిస్తున్నారని... ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలించి అధిక రేట్లకు అమ్ముతున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. గ్రామాల్లో వాలంటీర్లు, వైకాపా నాయకులే నాటుసారా తయారీ చేసి విక్రయిస్తున్నారని ఆరోపించారు.
వైకాపా పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని... మద్యపాన నిషేదం అని చెప్పి అర్ధరాత్రిళ్లు కూడా మద్యం అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ఇంతకుముందు... రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలకు అనుమతి ఉంటే ఇప్పుడు 9 గంటల వరకు అనుమతులిచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారని మండిపడ్డారు. మద్యం గొలుసు దుకాణాదారులు...మహిళలకు కమీషన్లు ఇచ్చి వైన్ షాపు నుంచి మద్యం కొనుగోలు చేయించి మహిళలతో మద్యం వ్యాపారం చేయిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు పాలనలో పంటపొలాల్లో పట్టిసీమ జలాలు పారితే, జగన్ పాలనలో పట్టణాల నుంచి పల్లెవరకు మద్యం ఏరులై పారుతోందని దుయ్యబట్టారు. కమీషన్లు ఇవ్వలేదని... నాణ్యమైన బ్రాండ్లు ఉత్పత్తి చేసే డిస్టరీలకు ఆర్డర్లు నిలిపివేసి కేసుకు 10 శాతం చొప్పున కమీషన్లు తీసుకుని నకిలీ బ్రాండ్లకు అనుమతిలిచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.
జగన్ ప్రభుత్వం అమ్ముతున్న కొత్త బ్రాండ్లు... తాగేవారికే కాదు, గూగుల్ కి కూడా తెలియటం లేదని ఎద్దేవా చేశారు. జలగ రక్తం తాగినట్లు జగన్ మద్యం రేట్లు 90 శాతం పెంచి పేదల రక్తం తాగుతున్నారని ధ్వజమెత్తారు. మందుకు అలవాటుపడిన వారు మద్యం మానలేక, పెరిగిన రేట్లతో మద్యం కొనలేక స్పిరిట్ తాగి 7మంది చనిపోయారని వారి కుటుంబాలకు దిక్కెవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అక్రమ మద్యంపై దృష్టి పెట్టి నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం కాకుండా ప్రజల ప్రాణాల కోసం ఆలోచించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: