Union Minister Prahlad Singh Patel in Tiruvur : కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో సిలికా ప్రభావంతో ఎక్కువ మంది కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతుండడం, వందల మంది ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోందని కేంద్ర జలశక్తి, ఆహారశుద్ధిశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ అన్నారు. ఆ ప్రాంతంలో రక్షిత మంచినీటి సరఫరాకు కేంద్రం జల్ జీవన్ మిషన్ కింద నిధులు కేటాయించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులు వేగంగా పూర్తి చేయలేక పోతోందని విమర్శించారు.
రాష్ట్రంలో నత్త నడకన సాగుతున్న పనులు : దేశంలో సిలికా కాలుష్యం ఈ ప్రాంతంలోనే ఉందని, క్షేత్రస్థాయిలో స్థితిగతుల పరిశీలనకు త్వరలో కేంద్ర బృందాన్ని ఇక్కడికి పంపిస్తామని, విజయవాడ పర్యటనకు వచ్చిన సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ మీడియాకు తెలిపారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలన్నింటికీ శుద్ధ జలాలు అందించిన ఘనత ప్రధాని మోదీదేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్రం నిధులు మంజూరు చేసిందని కానీ ఇక్కడి ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయటం లేదన్నారు. దీనివల్ల రాష్ట్రంలో పనులు నత్త నడకన సాగుతున్నాయని ఆరోపించారు.
చొరవ చూపకపోవడం విచారకరం : రాష్ట్రం ఒక వాటా ఇస్తే కేంద్రం మూడు వాటాలు విడుదల చేయటానికి సిద్ధంగా ఉందని, ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపకపోవటం విచారకరమన ప్రహ్లాద్‌సింగ్ పటేల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 70 వేల కోట్ల రూపాయల నిధులను జలజీవన్ మిషన్ కోసం ఖర్చు చేస్తోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 2024 నాటికి నూరుశాతం ప్రజల ఇళ్లకు నేరుగా కొళాయి నీరు అందనుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ దిశగా చొరవ చూపాలని ఆకాంక్షించారు.
అందరికీ ఆహారం : తృణ ధాన్యాల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచానికి దారి చూపుతోందని, ప్రపంచంలో పండే తృణధాన్యాల్లో 40 శాతం మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయని ఆయన అన్నారు. అందరికీ ఆహారం అనే నినాదంతో పాటు ప్రధాని మోదీ అందరికీ పౌష్టికాహారం అనే నినాదం ఇచ్చారన్నారు. చిరుధాన్యాలు మంచి సమతుల ఆహారం అని, వీటి ఉత్పత్తిని, వినియోగాన్నీ ప్రోత్సహించటానికి ప్రధాని ఎన్నో చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ప్రపంచ మార్కెట్లో తృణ ధాన్యాలకు డిమాండ్ : 2017 లో దుబాయిలో అంతర్జాతీయ ఆహార సదస్సులో పాల్గొన్నపుడు చిరుధాన్యాల ఘనతను ప్రధాని వివరించారని, 2019 లో ఐక్యరాజ్య సమితికి నివేదిక సమర్పించారని, ప్రపంచ మార్కెట్లో తృణ ధాన్యాలకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. యుద్ధాల కారణంగా ఆహార ధాన్యాల కొరత వస్తోందనని, దాన్ని పూడ్చటానికి తృణ ధాన్యాలను ఆయా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయిని చెప్పారు.
అమ్మవారి ఆశీస్సులు కోరిన ప్రహ్లాద్‌సింగ్ పటేల్ : విజయవాడ పర్యటన సందర్భంగా కొండపల్లి ఖిలాను సందర్శించానని, రెడ్డి రాజులు నిర్మించిన కొండపల్లి ఖిల్లాలోని ఆలయ శిథిలాలను చూశానని, ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయవలసి ఉందన్నారు. అందుకు పురావస్తు శాఖ, జిల్లా అధికారులూ పూనుకోవాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు కోరానని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు.
ఇవీ చదవండి