20 Rupees Meals: అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. అందుకే పేదల ఆకలిని తీరుస్తూ మానవసేవే మాధవ సేవ అని నిరూపిస్తున్నారు విజయవాడ వాసులు. విజయవాడలోని రద్దీ ప్రాంతాల్లో మొగల్రాజపురంలోని శిఖామణి సెంటర్ ఒకటి. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఈశ్వర్ ఛారిటీస్ ఆధ్వర్యంలో మనభోజనశాలను ఏర్పాటు చేసి రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు ఆహారం అందిస్తున్నారు. కేవలం సేవా భావంతోనే దీనిని నిర్వహిస్తున్నారు. అందుకే ఎలాంటి ప్రచారం చేయడం లేదు. ఒకరి ద్వారా.. ఒకరికి తెలిసి వస్తున్నారే తప్ప.. ఈ భోజనశాల వద్ద కనీసం రూ.20కే భోజనం అనే బోర్డు కూడా ఉండదు. ఏ సమయంలో వచ్చినా.. ఆహారం వేడివేడిగానే వడ్డిస్తుండడం వీరి ప్రత్యేకత. సేవాభావంతో ఈ హోటల్ ను ప్రారంభించినట్లు నిర్వాహకురాలు మాధవి తెలిపారు.
ఇంట్లో ఏవిధంగా వండుతామో అదే పద్ధతిలో హోటల్ లో వంటలు తయారు చేస్తున్నామన్నారు . కూరలకు వినియోగించే కారం ,దినుసులు ఇంట్లో తయారు చేసినవేనన్నారు. ఒక మనిషి కడుపునిండా తినే విధంగా మెనూ ఉంటుందన్నారు .మూడు కూరగాయలతో కూడిన కూర, ఒక కప్పు నిండా అరకిలో అన్నం, సాంబారు, మజ్జిగ అందిస్తున్నారు. వీటితో పాటు రోజు తప్పకుండా ఏదో ఒకరకం రోటి పచ్చడి తయారుచేసి పెడుతున్నారు. వాము కలిపిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇస్తున్నారు. ఆహారం వృథా కాకుండా ఒకరికి ఎంత సరిపోతుందో అంత అందిస్తున్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడమన్నారు.
హోటల్ లో పరిసరాలను శుభ్రంగా ఉంచుతారు. పనిచేసే సిబ్బంది చేతికి గ్లౌజులు ధరించి వడ్డిస్తారు. ప్లేట్లు శుభ్రంగా వేడి నీటితో కడుగుతారు .దీనికోసం ప్రత్యేక పరికరం అందుబాటులో ఉంచారు. వీలైనంత మందికి నాణ్యమైన ఇంటి భోజనం అందించాలనే లక్ష్యంతోనే ఈ భోజనశాలను ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతన్నారు. ప్రస్తుతం రోజుకు వంద మంది వరకూ వస్తున్నారని .. ఒక రోజుకు 500మంది వరకూ వచ్చినా ఆహారం అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు భోజనశాలను తెరిచి ఉంచుతామన్నారు. శిఖామణి సెంటర్ లో ఆసుపత్రులు ,కోచింగ్ సెంటర్లు ఉండటంతో నిరుద్యోగులు, యువత, ప్రైవేట్ ఉద్యోగులు వస్తున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్లు ,రోజువారీ కూలీలు నిత్యం రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒక్కో భోజనానికి తమకు 90 రూపాయల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. ఆకలిగా ఉన్న కడుపులను నింపేదుకే తక్కువ ధరను నిర్ణయించామన్నారు.
నగరానికి నిత్యం వివిధ పనులపై దూరప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆసుపత్రిలో బంధువులున్నారని కొందరు, ఉద్యోగాల వేటకు మరికొందరు వస్తుంటారు. మనభోజన శాల పరిసరాల్లో పనిచేసే చిరుద్యోగులు నిత్యం హోటల్ కు వస్తున్నారు. ఒకసారి వచ్చిన వాళ్లు నిత్యం ఇక్కడికే భోజనానికి క్యూ కడుతున్నారు. 20 రూపాయలకు ఎక్కడా భోజనం దొరకట్లేదని వినియోగదారులు చెబుతున్నారు. రూంలో అన్నం వండుకుని కూరలు తెచ్చుకున్నా చాలా ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఎంతో మందికి ఆకలి తీరుస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: