free crop insurance : ఉచిత బీమా పేరుతో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల్ని నిలువునా దగా చేస్తోంది. ఈ-క్రాప్‌లో నమోదైన ప్రతి ఎకరాకు బీమా చేస్తామని గొప్పగా చెప్పినప్పటికీ.. అమలు మాత్రం డొల్లేనని స్పష్టమవుతోంది. ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1.09 కోట్ల ఎకరాల్లో.. వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయగా.. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద 49.90 లక్షల ఎకరాలు మాత్రమే నమోదైంది. మిగిలిన 58.95 లక్షల ఎకరాలకు.. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అమలు చేస్తున్నామని చెబుతున్నా.. వాతావరణ ఆధారిత బీమా వర్తిస్తుందా అంటే వ్యవసాయశాఖ మౌనం వహిస్తోంది. రబీలో 47.98 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగుచేయగా.. పంటకాలం పూర్తయినప్పటికీ... పీఎంఎఫ్‌బీవై, వాతావరణ ఆధారిత బీమా కింద ఎంత విస్తీర్ణం నమోదైందనే వివరాలను వ్యవసాయశాఖ బయటకు చెప్పడం లేదు. ఖరీఫ్, రబీ వారీగా సాగు విస్తీర్ణం, అందులో పీఎంఎఫ్‌బీవై, వాతావరణ ఆధారిత బీమా కింద ఎంతెంత విస్తీర్ణానికి బీమా చేశారనే వివరాలను రహస్యంగా ఉంచుతోంది.
కేంద్ర బీమా పథకంలో.. 2020 ఖరీఫ్ నుంచి 2021-22 రబీ వరకు.. ఉచిత బీమా అమలు చేసిన ప్రభుత్వం.. 2022 ఖరీఫ్ నుంచి కేంద్ర బీమా పథకంలో చేరుతున్నట్లు ప్రకటించింది. పీఎంఎఫ్‌బీవైని బీమా సంస్థలకు అప్పగించగా వాతావరణ ఆధారిత బీమా మాత్రం సొంతంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ.. అందులో ఏ పంటకు ఎంత విస్తీర్ణంలో బీమా అమలవుతుందనే వివరాల్ని అనుబంధ శాఖలకు కూడా ఇవ్వడం లేదు. 2022 ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 79.14 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 29.72 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి.. మొత్తంగా 1.09 కోట్ల ఎకరాలను ఈ-క్రాప్‌లో నమోదు చేశారు.
ఇందులో 49.90 లక్షల ఎకరాలకే పీఎంఎఫ్‌బీవై వర్తిస్తోంది. వరి 35.20 లక్షలు, పప్పు ధాన్యాలు 6.88 లక్షలు, మొక్కజొన్న 3.21 లక్షల ఎకరాలతోపాటు.. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాల వరకు ఉంది. అయితే, పత్తి, మిరప, వేరుసెనగ, పండ్ల తోటల్లో ఫసల్ బీమా యోజన కింద ఎన్ని ఎకరాలు, రాష్ట్రం అమలు చేసే వాతావరణ ఆధారిత బీమా కింద ఎన్ని ఎకరాలు అన్న వివరాలు వ్యవసాయ అధికారులకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పీఎంఎఫ్‌బీవై వెబ్సైట్లో అన్ని రాష్ట్రాల వాతావరణ ఆధారిత బీమా వివరాలున్నా ఆంధ్రప్రదేశ్ గణాంకాలు మాత్రం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అమలు చేస్తుందనుకున్నా... ఆ వివరాలను వెబ్‌సైట్లో ఉంచడానికి భయమెందుకని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
వైబ్సైట్లో లేని పేరు.. రబీలో 47.99 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. 45.97 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 2.02 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలకు ఈ-క్రాప్ అయింది. మార్చి నెలలోనే వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని చెబుతున్నా.. ఇప్పటి వరకు పీఎంఎఫ్‌బీవై వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ పేరు కనిపించడం లేదు. దానికి కారణాలేమిటో కూడా వ్యవసాయశాఖ చెప్పే పరిస్థితి లేదు. ఖరీఫ్‌లో 5.43 లక్షల ఎకరాల్లో మిరప సాగు చేయగా... అందులో దిగుబడి ఆధారంగా 2.94 లక్షల ఎకరాలు, వర్షాధారంగా 35 వేల ఎకరాలకు మాత్రమే బీమా వర్తింపజేస్తుండగా.. మిగిలిన 2.14 లక్షల ఎకరాల్లో మిరప పంటకు బీమానే లేదు.
ఈ -క్రాప్‌లో నమోదైన ప్రతి ఎకరాకు బీమా ఉందని ప్రభుత్వం నమ్మబలుకుతుండటంతో రైతులు తమ పంటకు బీమా ఉందనుకున్నారు. చివరకు... పరిహారం ఎందుకు అందలేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయినా బీమా దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. గుంటూరు. పల్నాడు జిల్లాల్లో మిరపను వర్షాధారం కిందకు తెచ్చి బీమా వర్తించకుండా చేశారని మండిపడుతున్నారు. కర్నూలు జిల్లాలోనూ అధిక శాతం విస్తీర్ణానికి పంటల బీమా పథకం వర్తించడం లేదు.
మామిడి రైతులకు కష్టాలు.. 2019 వరకు రబీలో మామిడికి బీమా వర్తించింది. కానీ, మూడేళ్లుగా మొండిచేయి చూపిస్తున్నారు. ఏటికేడు మామిడి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నా.. పరిహారం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందనే కారణంతో ప్రభుత్వం దాన్ని బీమా పథకం నుంచే తొలగించింది. ప్రతి ఎకరాకు బీమా కల్పిస్తామనే హామీని పక్కనపెట్టింది. అరకొర పంటల బీమా అమలుతో రైతుల్ని నిలువునా ముంచుతోంది. ఏపీలో.. 2 లక్షల 59వేల 431 మంది రైతులు.. 5లక్షల 81వేల 755 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు.
మూడేళ్లుగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టాలు చవిచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు, నెల్లూరు మినహా.. అన్ని జిల్లాల్లోనూ మామిడికి రబీలో వాతావరణ ఆధారిత బీమా వర్తించగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో అమలైంది. 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఉచిత బీమా అమలు చేస్తూ.. రబీలో వాతావరణ ఆధారిత బీమా నుంచి.. మామిడిని తప్పించింది. ఈ ఏడాదీ చేర్చలేదు. ఈ ఏడాది కూడా కొన్ని జిల్లాల్లో మామిడి చెట్లు పడిపోయాయి. పెద్దఎత్తున నష్టం జరిగినా రైతులకు పైసా బీమా కూడా అందే పరిస్థితి లేదు.
ఇవీ చదవండి :