TDP Leaders Reaction on Gannavaram Attack:రాష్ట్రంలో పోలీసు శాఖను మూసేశారా? లేక వైఎస్సార్సీపీలో విలీనం చేశారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసుల ప్రేక్షక పాత్ర.. డీజీపీకి లేఖ: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనుసన్నల్లోనే గన్నవరం విధ్వంసం జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పట్ట పగలే విచక్షణ రహితంగా విధ్వంసానికి తెగబడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. గన్నవరంలో పోలీసులు రౌడీ మూకలను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శిస్తూ డీజీపీకి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైఎస్సార్సీపీ గూండాలకు పోలీసులే స్వేచ్ఛ ఇచ్చినట్లు ఉందని అన్నారు. టీడీపీ నేతలు దొంతు చిన్నా, పట్టాభి రామ్‌ల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టాభి ప్రాణాలకు ముప్పున్న రీత్యా అతని భద్రత పోలీసుల బాధ్యతే అని తేల్చిచెప్పారు.
ఒక్కో దాడి వైఎస్సార్సీపీకి సమాధి: టీడీపీపై జగన్ చేయిస్తున్న ఒక్కో దాడి వైఎస్సార్సీపీకి సమాధి కట్టే ఒక్కో ఇటుక లెక్క అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ కార్యలయం పై వైఎస్సార్సీపీ గూండాలు దాడి చేసి, నేతలని కొట్టి, వాహనాలను తగలబెడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూడటం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చని మండి పడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఆకురౌడీలు చెలరేగి పోతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు ధ్వజమెత్తారు.
పశు సంస్కృతి.. అరెస్ట్.. ప్రజలే నిర్ణయిస్తారు: టీడీపీ కార్యాలయంలో కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేయడం పశు సంస్కృతికి నిదర్శనం అంటూ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులి వెందుల రాజకీయాన్ని జగన్ రాష్ట్రం అంతా విస్తరింపజేస్తున్నారని మాజీ గన్నవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గన్నవరం ప్రజలే వంశీకి బుద్ధి చెబుతారంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి