Student Suicide drama in Krishna: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మైలవరంలో సాంఘిక సంక్షేమ వసతి గృహం ఉంది. అందులో తిరువూరు మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఉంటున్నారు. బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఈ ముగ్గురూ.. తర్వాత ఇళ్ల నుంచి మంగళవారం వసతిగృహానికి తిరిగి వచ్చారు. ఆ రోజు ప్రశాంతంగానే గడిచింది. బుధవారం సాయంత్రం ఆ ముగ్గురు బాలికల్లో ఒకరి మెడపై, చెంప మీద స్వల్ప గాయాలు ఉన్నాయి.
ఈ విషయాన్ని తోటి విద్యార్థినులు గమనించారు. వెంటనే వెళ్లి వార్డెన్‌కు తెలిపారు. పరుగు పరుగున వచ్చిన వార్డెన్.. విద్యార్థినిని విచారించారు. ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మాస్కు ధరించి తనపై హత్యాయత్నం చేశాడని చెప్పింది. కంగారుపడిన వార్డెన్.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వసతిగృహానికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థినిని ఆరా తీశారు. పోలీసులను చూడగానే భయపడిపోయిన సదరు బాలిక.. అసలు విషయం చెప్పేసింది.
ఇదంతా ఓ ప్లాన్ అని చెప్పింది. దీనికి కర్త, కర్మ తాము ముగ్గురమే అని తెలిపింది. ఆశ్చర్యపోయిన పోలీసులు.. వార్డెన్.. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించింది. తమకు మళ్లీ ఇంటికి వెళ్లాలని అనిపించిందని, అందుకే ముగ్గురం కలిసి ఈ ప్లాన్ వేశామని చెప్పింది. తాను పెన్సిళ్లు చెక్కే షార్పనర్ బ్లేడుతో మెడ, చెంపపై గాట్లు పెట్టుకున్నానని సదరు బాలిక తెలిపింది. తొలుత తాము ఉల్లిపాయలు పెట్టుకుని జ్వరం వచ్చినట్లు నాటకం ఆడదామనుకున్నామని, కానీ.. తోటి విద్యార్థినుల ప్రోద్బలంతో ఇలా గాయపరుచుకున్నామని బాలిక చెప్పింది. దీంతో.. ఉపాధ్యాయులు, వార్డెన్, పోలీసులు అవాక్కయ్యారు.
అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ముగ్గురు విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను.. వసతిగృహ వార్డెన్ బెజవాడ అలివేలు మంగమ్మ వెల్లడించారు.