అన్ని దానాల్లోనూ రక్తదానానిది అపురూప స్థానం. అలాంటి దానంలో ముందుంటున్నారు కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంత ప్రజలు. రక్తదానంపై 2005లో ఓ కార్యక్రమం నిర్వహించిన యాసం చిట్టిబాబు.. దివిసీమ ప్రాంత ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(indian red cross society) జీవితకాల సభ్యులైన ఆయన.. ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తం ఎంత ముఖ్యమో వివరించారు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందరినో రక్తదానం వైపు మళ్లించారు. ఆయన సేవలకు గుర్తింపుగా.. 2008లో అప్పటి గవర్నర్ ఎన్డీ తివారీ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు, బంగారు పతకం అందుకున్నారు.
అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసి, ఈ మధ్యనే రిటైరైన భోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావు.. విద్యార్థులు, వాలంటీర్లలో చైతన్యం నింపారు. రక్తం అవసరమైన వారి దగ్గరికి వెంటనే దాతను పంపేలా ఏర్పాటు చేశారు. ఆ విధంగా 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 12 వందల మందితో రక్తదానం చేయించారు. 'యూత్ రెడ్ క్రాస్' యూనిట్‌కి నోడల్ అధికారిగా పనిచేసిన సుబ్రహ్మణ్యేశ్వరరావు.. 2018న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు.
యాసం చిట్టిబాబు, భోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావును ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది యువకులు రక్తదానం చేస్తున్నారు. 'మన అవనిగడ్డ' వాట్సప్ గ్రూప్ ద్వారా.. ఇప్పటికే 3వేల 500 మందికి రక్తం అందించారు. రెడ్ క్రాస్ సొసైటీకి అవసరమైనప్పుడల్లా రక్తం ఇస్తున్నారు. ప్రతి వ్యక్తి సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా రక్తదానం చేయడం ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కొవిడ్ సమయంలో తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు అందరూ ముందుకురావాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: