వెనుకబడిన వర్గాల ప్రజల సంక్షేమంపై సీఎం జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగాధర్ ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ అంశంలో హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్తున్న వైకాపా ప్రభుత్వం, బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఎందుకు రివ్యూకి వెళ్ళలేదని ప్రశ్నించారు. సీఎం ఏడాది పాలనపై 'మీ పాలన మా సూచన' పేరుతో ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాధ్ సీఎంకు బహిరంగ లేఖ రాశారు.
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారని..మీరెందుకు స్పందించరని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎందుకు అడగలేకపోతున్నారన్నారని ప్రశ్నించారు. కేంద్రానికి పూర్తిగా సరెండర్ అయిపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదా, నవరత్నాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకెళ్తున్నారన్నారు.
గతంలో అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మద్య నిషేధం అని చెప్పిన ప్రభుత్వం విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేస్తుందన్నారు. మద్యం ఆదాయం లేనిదే ప్రభుత్వాన్ని నడపలేమని తేల్చేశారన్నారు. సంవత్సరంలోనే జగన్ 90 వేల కోట్లు అప్పు చేశారని.... పూర్తిగా ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ, అప్పులు చేస్తూ, విద్యుత్ చార్జీలు పెంచారన్నారు.
ఇదీ చదవండి: 'నా కారు డ్రైవర్ మృతికి సీఎం బాధ్యత వహించాలి': మాజీ మంత్రి