కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల మూసివేతకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పేదవారిని ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా శ్రేణులు ధ్వజమెత్తుతున్నాయి. ఐదు రూపాయలకే దొరికే భోజనాన్ని పేదవారికి దూరం చేశారని విచారం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ నగర శివారు జక్కంపూడి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో మూసివేసిన అన్న క్యాంటీన్ ఎదురుగా మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు ధర్నా చేపట్టారు. జక్కంపూడి కాలనీ వీధుల్లో తెదేపా శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే క్యాంటీన్లను మూసివేయడం దుర్మార్గమైన చర్య అని ఉమ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే తెరవాలని కోరారు.
పటమటలోని అన్నా క్యాంటీన్ వద్ద తెదేపా తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అన్నాక్యాంటీన్లు పేరు మార్చుకునైనా అన్నా క్యాంటీన్లు తెరవాలని అవినాష్ ధ్వజమెత్తారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు తెరవాలని ధర్నా చేపట్టారు.
పేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన అన్నాక్యాంటిన్లను తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్టణంలో తెదేపా నాయకులు అన్నాక్యాంటిన్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధర్నాలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నింటినీ రద్దుచేసుకుంటూ స్వప్రయోజనాలకోసం పాకులాడుతున్నారంటూ విమర్శించారు.
ఇదీ చదవండి