TURMERIC FARMERS PROBLEMS : ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్నదాతల ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, మరోవైపు పసుపు పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. పంటలకు మద్దతు ధర లేకపోతే ఆర్ధికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని రైతు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
కన్నీళ్లు తెప్పిస్తున్న పసుపు : ఉమ్మడి కృష్ణా జిల్లాలో లంక, మెట్ట భూముల్లోని రైతులు పసుపు పంటను సాగు చేస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, విత్తనాలు, పురుగు మందులు ధరలు పెరిగిపోవడంతో పసుపు రైతులపై ఆర్ధిక భారం పెరిగిపోతోంది. ఈ సంవత్సరం తమకు పసుపు పంట కన్నీళ్లు తెప్పిస్తోందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం పసుపు సాగు చేయాలంటే దాదాపు 70 వేల నుంచి 80 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు.
ఆశ్రద్దగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు : ఈ సంవత్సరం వాతావరణంలో మార్పుల ప్రభావం కారణంగా ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు మాత్రమే పసుపు ఉత్పత్తి అవుతుందని రైతులు అంటున్నారు. ప్రతి సంవత్సరం 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు పసుపు పండేదని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం పసుపు పంటకు మద్దతు ధర కూడా లేకపోవడంతో తాము పెట్టిన ఖర్చులు కూడా వస్తాయా అన్న అనుమానం కలుగుతోందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
పసుపునకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు మొదటి నుంచి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. పసుపు కొనుగోలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేల ఎకరాల్లో రైతులు పసుపు పంటను సాగుచేస్తారు. మద్దతు ధర లేక ఇప్పటికే చాలా మంది రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. గత సంవత్సరం జూన్లో మేలు రకం పసుపును మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఈ సంవత్సరం అనుకున్న సమయానికంటే ముందుగానే పంట చేతికి వచ్చిందని రైతులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఆకాశాన్ని తాకుతున్న రసాయనాల రేటు.. పాతాళంలో పసుపు రేటు : ప్రస్తుతం పసుపు క్వింటాకు 4 వేల నుంచి 4,500 ధర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ధర లేకపోవడం వల్ల తాము ఆర్ధికంగా ఇబ్బందులుపడుతున్నామని తెలిపారు. వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి పసుపు పంటను సాగు చేశామని, ఇప్పుడు మద్దతు ధర లేకపోవంతో ఏం చేయాలో ఆర్ధం కావడం లేదని వాపోతున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల పసుపు పంటలో ఎక్కువ భాగం పాడైపోయిందని, ఈ పంటను కోనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని రైతులు అంటున్నారు. పసుపు పంటకు 6 నుంచి 7 వేల ధర ఇస్తే రైతుకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి రావాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కూలీల రేట్లు, రసాయనాల రేట్లు పెరిగిపోయాయని రైతులు తెలిపారు.
అందుబాటులో లేని గిడ్డంగులు : పసుపు కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ కమిటీల ద్వారా పసుపు పంటను కోనుగోలు చేయాలని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు విషయంలో మెతక వైఖరి అవలంభించడం వల్ల దళారులు పెరిగిపోతున్నారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళారులు ఇష్టానుసారంగా అడుగుతున్నారని రైతులు అంటున్నారు. మద్దతు ధర వచ్చే వరుకు పసుపు పంటను నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు కూడా లేవని రైతులు తెలిపారు. గిడ్డంగులు రైతులకు అందుబాటులో ఉండే రైతు అనుకున్న ధర వచ్చే వరకు పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని, పంటను నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. సొంత పొలం కొద్ది మందికే ఉంటే ఎక్కువగా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు.
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత : ధాన్యం కొనుగోలు లేక ఒక వైపు ధాన్యం రైతులు ఇబ్బందులు పడుతుంటే మరొక వైపు మద్దతు ధర లేక పసుపు రైతులు అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలను రైతులకు ఇబ్బంది లేకుండా చేసి నిరుపించుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి