CM KCR paid tribute to Kaikala Satyanarayana: వెండితెరపై నవరసాలు పండించిన నటశిఖరం కైకాల సత్యనారాయణ మృతి పట్ల అభిమానలోకం విషాదంలో మునిగిపోయింది. కైకాల మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ.. తన వైవిధ్యమైన నటన ద్వారా మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కైకాల పొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. కైకాల కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ఆర్థిక, వైద్య మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. సుమారు 800 సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి.. నవరసనట సార్వ భౌముడిగా తెలుగుచలన చిత్ర పరిశ్రమలో వెలుగొందారని కొనియాడారు. కైకాల మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని హరీశ్ రావు పేర్కొన్నారు. జానపద, పౌరాణిక, సాంఘిక, కుటుంబ కథా చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించి, ప్రతినాయకుడుగా విలక్షణ నటనతో సినీ అభిమానుల మనస్సులో స్థానం సంపాదించుకున్న గొప్ప నటుడని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
విలక్షణ నటుడిగా.. ఘటోత్కచుడిగా సినీ అభిమానులను మెప్పించి, అనేక చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ మృతి చిత్ర సీమకు తీరని లోటు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కైకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల మృతిపట్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని, శ్రీనివాస గౌడ్, తదితరులు సంతాపం తెలిపారు.
ఇవీ చదవండి: