కృష్ణా జిల్లా మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లోని 12 మండలాల్లో ఈనెల 17న మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన, గూడూరు, మొవ్వ, ఘంటసాల, మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 225 పంచాయితీల్లో వార్డులతో సహా 26 ఏకగ్రీవం కాగా.. 199 చోట్ల ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి. 2,246 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పకడ్బంధీగా బందోబస్తు ఏర్పాట్లు:
మూడో దశ పంచాయతీ ఎన్నికలకు పోలీసులు పకడ్బంధీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. 107 సమస్యాత్మక, 130 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు గుర్తించామన్నారు. 731 కేసులలో మొత్తం 4,247 మందిని బైండోవర్ చేశామన్నారు. 1,756 మంది పోలీసులు, అదనంగా 2,250 మంది ఇతర విభాగాల సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహిస్తామని వివరించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, 30 పోలీసు చట్టం అమల్లో ఉంటాయని ఎస్పీ పేర్కొన్నారు. మద్యం రవాణా, నగదు పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఇప్పటి వరకు రూ. కోటీ 72 లక్షలకు పైగా నగదు, 20 గ్రాముల బంగారం, 23 కేజీల వెండి, 29,312 మద్యం సీసాలు, 2,116 లీటర్ల నాటుసారా, 90,740 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినా.. మద్యం, నగదు, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తరహా సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీస్ కంట్రోల్ రూం 8332983792, పోలీస్ హెల్ప్ లైన్ 9491068906, పోలీసు వాట్సప్ నెంబర్ 9182990135కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: