నందిగామ సబ్ డివిజన్ పరిధిలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో 135 గ్రామపంచాయతీలో ఈ నెల 9న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అప్పటివరకు గ్రామాల్లో ఎటువంటి గొడవలు జరగకుండా అత్యంత సమస్యాత్మక ,సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు కవాతు చేస్తున్నారు. దీనిలో భాగంగా నందిగామ మండలం గొల్లముడి గ్రామంలో నందిగామ సీఐ కనకారావు ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులకు అవగాహన కల్పించారు. గొడవకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ సీఐ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా తుర్లపాడు, కొనాయపాలేం, ముప్పాళ్ళ, చందర్లపాడు గుర్తించినట్లు సీఐ తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలన్నారు. శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ నామినేషన్ల సందడి