Organic Farmers compound: అమృతాన్ని పండిద్దాం.. అమృత ఆహారం తిందాం నినాదంతో విజయవాడలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల మహాసమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, వినియోగదారులు, వ్యాపారులు ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. అన్ని రంగాలకి వ్యవసాయమే ఆధారం అవుతున్నా... రైతు వెతలు మాత్రం ఎవరికీ పట్టడం లేదని ఆవేదన చెందారు. సందర్భంగా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ రైతులు ఒకచోట కలిశారు. రైతుల ఐక్యత, శక్తి, స్ఫూర్తిని చాటేందుకు ప్రయత్నం చేశారు.
దేశ గతి మారుతున్నా.. అన్నదాతల ఆర్థిక స్థితి మారడం లేదని నిట్టూర్చారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కష్టాలు తీరడం లేదని.. ఆరుగాలం శ్రమని, శక్తిని ధార పోస్తున్నా జీవితాలు మెరుగుపడడం లేదని ఆవేదన చెందారు. విడివిడిగా, ఒంటరిగా పోరాటం చేసే రైతన్నలని ఏకం చేసి.. వారిని సుశిక్షితులుగా మలచి, మార్కెటింగ్ భరోసానిచ్చి అండగా నిలిచేందుకు గో ఆధారిత ప్రకృతి రైతుల సంఘం పనిచేస్తోందని.. ఈ సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు కావస్తున్న సందర్భంగా ప్రకృతి రైతుల మేలుకోసం.. సమష్టిగా ముందడుగు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షకు ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
నేలతల్లిని నాశనం చేసే రసాయనాలకి బదులుగా ప్రకృతి వ్యవసాయం చేయకపోతే.. మున్ముందు భూమిలో పంటలు పండే పరిస్థితి లేకుండా పోతుందని ఆవేదన చెందారు. ఈ మహాసమ్మేళనంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాల వివరాలను ప్రభుత్వానికి పంపిస్తామని- వాటి సాధన కోసం ఒత్తిడి తీసుకొస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఇవాళ పర్యవరణం నాశనమైంది, భూమి నాశనమైంది, ఆరోగ్యం నాశనమైంది. అలాగే రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు కనుక భూమిని బాగుచేసుకుంటూ.. భూమిని పోషించుకుంటూ తిరిగి వ్యవసాయం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఆనందంగా జీవించగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆ మహాభాగ్యంలేనిది ఏం చెయ్యాలేం అనే ఉద్దేశ్యంతో ఈ సంస్థను ప్రారంభించాం. భూమిని పోషించుకుంటూ తిరిగి వ్యవసాయం చేస్తే ఏ వ్యాధులు మనకి రావు.- భూపతిరాజు రామకృష్ణరాజు, గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం గత 10 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో రసాయన పదార్థాలు వాడకుండా.. రకరకాల విధాలుగా వ్యవలసాయం చేస్తున్నారు. అయితే మార్కెటింగ్ ఇతరత్ర సమస్యలున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని రకాల వర్గాలు అన్ని రకాల వ్యక్తులను కలిపి ఈ సంస్థను ప్రారంభించాం. ప్రారంభించిన తర్వాత రైతులకు ట్రైనింగ్ ఇవ్వటం, మార్కెటింగ్ ఇబ్బందులను ఎదుర్కోడానికి సహకార సంఘాన్ని ప్రారంభించటం, దాని ద్వారా కొనుగోలు చేయటం జరిగింది. అలాగే ఈ సంస్థ స్థాపించి 10 సంవత్సరాలు అవుతున్నందున ఈ మహాసమ్మేళనం ఏర్పాటు చేశాం.- జలగం కుమారస్వామి, భారత్ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు