ఆ అవ్వాతాతల పేర్లు తుకాణం (70), అంజమ్మ (65). ఆయనది చెన్నై..ఆమెది నెల్లూరు. వారిది ప్రేమ వివాహం. నెల్లూరు శివారులో కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేస్తుండేవారు. ఉన్నంతలో పది మందికి సాయపడేవారు. కాలం కలిసి రాక వ్యవసాయం ‘భారమైంది. దీంతో పొట్టచేత పట్టుకుని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌కు వలస వచ్చారు. వీరికి సంతానం లేరు.
స్థానికంగా ఉన్న పోరంబోకు స్థలంలో ఓ పూరిపాక ఏర్పాటు చేసుకుని జీవితం ప్రారంభించారు. అయితే ఆ స్థలంపై రాజకీయ నాయకుల కళ్లుపడి అక్కడ నుంచి వారిని ఖాళీ చేయించారు. అదే సమయంలో అంజమ్మను అనారోగ్యం వెంటాడింది. వైద్యం చేయించుకునే శక్తి లేకపోవడంతో ఆమెకు మతిస్థిమితం లేకుండా పోయింది. అప్పటినుంచి వారు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి దొరకని దుస్థితికి వచ్చారు. బాపులపాడు మహాత్మాగాంధీనగర్‌లో వాటర్ ప్లాంట్ ప్రాంగణమే వారికి దిక్కైంది. ఎండకు ఎండుతూ...వానకు తడుస్తూ..చలికి వణుకుతూ ఆరుబయటే ఆ పండుటాకులు కాలం గడుపుతున్నారు. తాతకు పని దొరికి నాలుగు రాళ్లు చేతికొస్తే ఏ హోటల్లోనో భోజనం కొనుక్కునో.. లేదంటే ఎవరైనా దయతలచి నాలుగు మెతుకులు పెడితేనో కడుపు నింపుకుంటున్నారు.
కరోనాతో చేసేందుకు పనిలేదు. ఆకలి తీర్చుకునే మార్గం లేక...యాచించడానికి మనసు రాక అవస్థలు పడుతున్నారు. మతిస్థిమితం లేని భార్యను విడిచి ఆయన బయటకు వెళ్లలేక..చివరికి మంచినీటితో ఆకలి తీర్చుకుంటున్నారు. నిత్యం ఎంతోమంది ఇటువైపుగానే రాకపోకలు సాగిస్తూనే ఉన్నా వీరి దయనీయ స్థితి మాత్రం ఎవరికీ కనిపించడం లేదు…ఎందుకో…
ఇవీ చదవండి: దేవాలయాలపై జరుగుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయి: అంబికా కృష్ణా