No Salaries For Teachers : వైసీపీ పాలనలో ప్రతి నెలా జీతాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో బ్యాంకులకు చెల్లించాల్సిన వాయిదాలు, కుటుంబ ఖర్చులు, మందులకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం సాకులు చెప్పకుండా సకాలంలో జీతాలు ఇవ్వాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగోన్నతులు, బదిలీలు పొందిన వారికి సాంకేతిక సమస్యను సాకుగా చూపి జీతాలు విడుదల చేయడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. జీతాల కోసం నెలల తరబడి ఎదురు చూపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొందరికి ఒక నెల వేతనాలు వచ్చాయని... ఇంకా రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అవి ఎప్పటికీ వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
Unpaid Salaries of Teachers in AP : ఉపాధ్యాయుల వేతన వెతలు..! గురుపూజోత్సవం రోజునా ఎదురుచూపులే..
ఇటీవల క్రమబద్ధీకరణలో భాగంగా వివిధ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేశారు. అలా ప్రధానోపాధ్యాయులు లేని పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు జూన్ నెల నుంచి జీతాలు చెల్లించడం లేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇలాంటి వారు 500 మందికి పైగా ఉంటారని ఉపాధ్యాల సంఘాల నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే దాదాపు 5 వేల మంది ఉన్నారని వివరిస్తున్నారు. కేవలం ప్రధానోపాధ్యాయులు లేని కారణంగా ఆ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ వేతనాలు నిలిపేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చిన ఉపాధ్యాయుల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో వారికీ వేతనాలు నిలిచిపోయాయి. జీతాలు రాక నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
జూన్లో జరిగిన బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయలకు వేతనాలు నిలిచిపోయాయి. ఉపాధ్యాయుల కుటుంబాలు అప్పులతో ఇబ్బంది పడుతున్నాయి. సాంకేతిక సమస్యను సాకుగా చూపుతూ వేతనాలు నిలిపేయడం సరికాదు. - సుందరయ్య, యూటీఎఫ్ నాయకుడు
మేం జీతం ఆధారంగానే బతుకుతున్నాం. కుటుంబ ఖర్చులతో పాటు పిల్లలు, తల్లిదండ్రుల మందుల ఖర్చులకు ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది టీచర్లు బ్యాంకు ఈఎమ్ఐ చెల్లించలేక బాధపడుతున్నారు. - ఇమామ్ బాషా, ప్రధానోపాధ్యాయుడు
జీతాల మీదే ఆధారపడి జీవన సాగిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకుంటే... ఇంటి అద్దె, నిత్యావసర వస్తువులు, పిల్లల ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు ఎలా చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సాంకేతికంగా తాము పురోగతి సాధిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం... మరోవైపు సాంకేతిక కారణాలు చూపుతూ జీతాలు నిలుపుదల చేయడంపై మండిపతున్నారు. జీతాలు సకాలంలో చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం కారణాలు చెప్పకుండా ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ఎలాంటి మేలు జరగలేదు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చి ఉపాధ్యాయులను, విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. - కె. శ్రీనివాసరావు, యూటీఎఫ్ నాయకుడు
ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఉపాధ్యాయుల పట్ల కక్ష చూపుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. - మనోహర్, ఉపాధ్యాయ సంఘ నాయకుడు