తెలుగురాష్ట్రాల వరప్రదాయిని... నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. ఎగువన ప్రవాహం పెరుగుతుండడంతో... పదేళ్ల తర్వాత సోమవారం మొత్తం గేట్లు అన్నింటినీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మొదట ఉదయం 7.25 గంటలకు 4 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల ప్రారంభించినా... కొద్దిసేపటికే మరో రెండు.. ఆ తర్వాత మొత్తం 26 గేట్లనూ ఎత్తేశారు. అటు కృష్ణా ప్రవాహానికి తుంగభద్ర తోడయింది.
శ్రీశైలం ఎగువన రెండు నదుల ప్రవాహం కలిపి 10 లక్షల క్యూసెక్కుల వరకు వరద వస్తోంది. జూరాల నుంచి దిగువకు 8.21 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నది నుంచి సుంకేశుల బ్యారేజీ వద్ద 2.08 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ ప్రవాహమంతా శ్రీశైలం జలాశయానికి పరుగులు పెట్టి... సాగర్‌కు చేరుతోంది. ఎగువన ఆలమట్టి వద్ద 5.5 లక్షలు, నారాయణపూర్ వద్ద 5.90 లక్షలకు పైగా ప్రవాహం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
అంతేకాకుండా... భీమా నదిలోనూ లక్ష క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వస్తోంది. ఇవన్నీ కలిసి శ్రీశైలం జలాశయానికి పెద్దఎత్తున పోటెత్తుతున్నాయి. అక్కడి నుంచి దిగువకు 8.26 లక్షల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. వరద అంతకంతకూ పెరగడంతో సోమవారం సాయంత్రానికి సాగర్‌కున్న మొత్తం 26 గేట్లనూ 12 అడుగుల మేర ఎత్తి 3.27 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. విద్యుదుత్పత్తి, ఎడమ కాల్వ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు కలిపి మరో 40 వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళుతోంది.
పులిచింతలను ముద్దాడిన కృష్ణమ్మ...
నాగార్జునసాగర్ నుంచి అన్ని గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటం... టెయిల్‌పాండ్ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడంతో కృష్ణమ్మ పులిచింతల వైపు పరుగులు పెడుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రానికి 2.4 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. మొత్తం 45 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇవాళ సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని... అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టనుందని అధికారులు చెబుతున్నారు.
పర్యాటకుల సందడి...
చాలా ఏళ్ల తరువాత నాగార్జునసాగర్ అన్ని గేట్ల ఎత్తి నీటిని దిగువకు వదులుతుండడంతో... సహజ సుందర జలదృశ్యాన్ని చూడడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఘాట్‌రోడ్లపై ఎక్కడ చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్ల సుందర దృశ్యాలు వారం పాటు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ...