కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో ప్రవహిస్తున్న మున్నేరుకు వరద వచ్చిన ప్రతిసారి విలువైన వ్యవసాయ భూములు కోతకు గురవుతున్నాయి. గత నెలలో తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మున్నేరుకు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు 1.30 లక్షల క్యూసెక్కుల వరద నదిలో ప్రవహించింది. దీంతో వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల పరిధిలోని ఆలూరుపాడు, పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు గ్రామాల పరిధిలోని ఏటి పట్టు వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయి.
ప్రధానంగా పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు పై ఉన్న వంతెనకు ఇరువైపులా ఉన్న విలువైన వ్యవసాయ భూమి మున్నేరులో కలిసిపోయింది. సహజంగానే ఈ ప్రాంతంలో ఎకరా భూమి 50 లక్షలు పైచిలుకు ధరలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో విలువైన భూములు కోతకు గురికావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 2 దశాబ్దాలుగా మున్నేరు వరదల వల్ల భూములు నదిలో కలిసిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చోట్ల కరకట్టల నిర్మాణం చేయాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు