Problems Of Maize Farmers : ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొక్కజొన్న పండించిన రైతులు తమ పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. రబీ సీజన్లో రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంటకు మొగ్గు చూపారు. ఎన్టీఆర్ జిల్లాలో 23 వేల 320 ఎకరాల్లో మొక్కజొన్న, 18 వందల 55 ఎకరాల్లో జొన్న, కష్ణాజిల్లాలో 16వేల 11 ఎకరాల్లో మొక్కజొన్న, 4 వేల 7 వందల 72 ఎకరాల్లో జొన్నని రెండో పంటగా సాగు చేశారు. కృష్ణాజిల్లాలోని తోట్లవల్లూరు మండలంలో అధికంగా 3వేల 3వందల 40 ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారు.
దుక్కి మొదలు విత్తనాలు, ఎరువులు, కలుపు తీత, పంట రక్షణ చర్యల కోసం ఎకరాకు దాదాపు 40 వేల వరకు రైతులు ఖర్చు చేశారని తెలిపారు. వాతావరణ పరిస్థితులు బాగుంటే ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేదని రైతులు చెబుతున్నారు. కోత దశలో క్వింటా 2,300 పలకగా, ఇప్పుడు 1500కు పడిపోయిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం 19 వందల 62 రుపాయలను కనీస మద్దతు ధరగా నిర్ణయించినప్పటికీ.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారుల చేతికి చిక్కి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు వ్యాపారులతో కుమ్మకై, తక్కువ రేటు నిర్ణయించడంతో.... పంటను అమ్ముకోలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. పండిన పంటను స్టోరేజ్‌లు లేకపోవడంతో పంట వర్షానికి తడుస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటపై కప్పేందుకు పట్టలు ఇవ్వాలని కోరినా రైతు భరోసా కేంద్రాల అధికారుల స్పందింలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ముందు ప్రైవేట్ వ్యాపారులు క్వింటాను 3 వేలకు కొనుగోలు చేస్తే.. ఇప్పుడు అది 14 వందలకు పడిపోయిందంటున్నారు. రైతుల నుంచి నేరుగా పంటలను కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం నేటికీ
ఆ దిశగా అడుగులు వేయకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని మండిపడుతున్నారు. ఈ దళారులు నిర్ణయించిన ధరలకు అమ్మితే..... అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని కన్నీళ్లు పెడుతున్నారు.
ఇప్పటికే అకాల వర్షాలతో అల్లాడుతున్న తమని దళారులు దగా చేస్తున్నారంటూ..వారి వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు మండిపడుతున్నారు. రైతు దగ్గర నుంచి నేరుగా పంట కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం..... ఆ మాటను నిలబెట్టుకుని తమను ఈ కష్టాల నుంచి బయట పడేయాలంటూ రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి :