Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. ఆదివారం గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. పిల్లలు మొదలుకొని యువత, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున రోడ్లపై బారులు తీరి.. సంఘీభావం తెలిపారు.
190వ రోజైన సోమవారం మధ్యాహ్నం.. బీసీలు, చేతివృత్తిదారులతో నిడమానూరు శివారులోని బస కేంద్రం వద్ద లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ చేతివృత్తుల వారు ఏర్పాటుచేసిన ప్రదర్శననలను లోకేశ్ తిలకించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస కేంద్రం వద్ద నిర్వహించిన సెల్ఫీ విత్ నారా లోకేశ్ కార్యక్రమంలో వేలాది మందితో ఫోటోలు దిగారు.
సాయంత్రం 6 గంటల సమయంలో నిడమానూరు నుంచి పాదయాత్ర ప్రారంభమై.. గూడవల్లి సెంటర్, కేసరపల్లి, గన్నవరం ఎయిర్‌పోర్టు, గాంధీబొమ్మ సెంటర్ మీదుగా చిన్న అవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకుంది. ప్రజలు యువనేతకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆప్యాయంగా పలకరిస్తూ లోకేశ్.. వారి సమస్యలు తెలుసుకున్నారు. పలువురు వినతిపత్రాలు అందించారు.
భూములిస్తే రాజధానిలో నివేశన స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. జగన్ ప్రభుత్వ వాటిని కాలరాసిందని.. గన్నవరం విమానాశ్రయ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రాజధానిలో ప్లాట్లు ఇస్తామని.. కౌలు మొత్తం చెల్లిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. గన్నవరం ఊరచెరువులో మురుగువేస్తున్నారని.. స్థానికులు ఫిర్యాదు చేశారు. గాంధీబొమ్మ సెంటర్‌లో.. న్యాయవాదులు లోకేశ్‌ను కలిసి.. సమస్యలు విన్నవించారు.
గన్నవరం ముఖద్వారం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాదయాత్ర ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యాలయం ముందు నుంచి వెళ్లాలని.. తెలుగుదేశం శ్రేణులు పట్టుబట్టగా.. పోలీసులు అటువైపు వెళ్లకుండా బారికేడ్లు, వాహనాలు అడ్డుగాపెట్టి నిలువరించారు. దీంతో పోలీసులు, తెలుగుదేశం నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు రహదారిపై విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
గన్నవరం చేరుకున్న లోకేశ్‌కు పార్టీ నాయకులు, అభిమానులు.. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఘనస్వాగతం పలికారు. పోలీసుల చాటున ఎమ్మెల్యే దాక్కున్నారని నినాదాలు చేశారు. తాము యువగళం స్ఫూర్తిని చెడగొట్టే కుట్రల ఉచ్చులో పడొద్దంటూ.. ప్రజల చెంతకే వెళ్తామంటూ పాదయాత్రను లోకేశ్ గన్నవరం పట్టణంలోకి మళ్లించారు. గన్నవరంలో లోకేశ్.. అధికార పార్టీ నాయకులకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
Grand Welcome to Lokesh Yuvagalam: ఉత్సాహంగా లోకేశ్ పాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం..
గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఉన్న హెచ్‌సీఎల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎదుట సెల్ఫీ దిగిన లోకేశ్.. 2008లో తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన సంస్థ అని గుర్తుచేశారు. 750 కోట్ల రూపాయలతో ఏర్పాటైన ఈ సంస్థలో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. జగన్‌లా తాము చదువుకున్న యువతతో చేపల దుకాణాలు, మాంసం మార్టులు పెట్టించలేదని ఎద్దేవా చేశారు.
అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అయితే.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ జగన్ అంటూ తన సెల్ఫీ తీసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. పాదయాత్రలో లోకేశ్ భద్రతను పోలీసులు పట్టించుకోలేదని.. తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. లోకేశ్‌ను కలిసేందుకు స్థానికులు ఎగబడుతున్నా.. రోప్‌పార్టీ పోలీసులు లేకపోవడంతో ఇబ్బందిపడ్డామన్నారు.