Lokesh fire on TDP leaders house arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలు.. ఆయనపై అభిమానానికి నిదర్శనమని నారా లోకేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళలు, ధర్నాలు దీక్షలు కొనసాగుతుండగా.. మరోవైపు తెలంగాణలోనూ హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు మద్దతుగా నిరసన తెలపడంపై లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఏపీలో ప్రజా కార్యక్రమాలను అణచివేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై పార్టీ, ప్రజలు చేపట్టిన కార్యక్రమాలను చూసి ప్రభుత్వం వణికిపోతోందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు (Chandrababu)పై ప్రభుత్వ కుట్రలు విఫలం కావాలని అధినేతకు మంచి జరగాలని దేవాలయాల్లో పూజలకు వెళుతున్నవారిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోవడంపై లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గుడికి వెళుతుంటే కూడా అర్థం లేని నిబంధనలతో అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం జగన్ (Jagan) పిరికితనానికి నిదర్శనం అన్నారు. జగన్ పాపం పండిందని.. వైసీపీ ప్రభుత్వానికి మూడిందని లోకేశ్ మండిపడ్డారు. తెలుగుదేశం నేతలు, ప్రజలు గుడికి వెళ్లాలో వద్దో కూడా జగన్ నిర్థేశిస్తారా అని ప్రశ్నించారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలతో నిరసనలను, చంద్రబాబుకు వస్తున్న మద్ధతును అడ్డుకోలేరని అన్నారు.
TDP Leaders Protest in Visakhapatnam: విశాఖలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ
చంద్రబాబు అరెస్టుపై దేశ, విదేశాల్లో సైతం వెల్లువెత్తుతున్న నిరసనలు ఆయన పాలనకు, ప్రజాసేవకు నేడు అద్దం పడుతున్నాయని లోకేశ్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అనేక ప్రాంతాల్లో జరుగుతున్న దీక్షలు, నిరసనలు, ర్యాలీలు చంద్రబాబు నిష్కళంక చరిత్రను చాటి చెబుతున్నాయని పేర్కొన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో, ఇతర దేశాల్లోని అనేక నగరాల్లో జరుగుతున్న మద్ధతు ర్యాలీలు... 45 ఏళ్లగా చంద్రబాబు (CBN) చేసిన అభివృద్ధి రాజకీయాలకు నిదర్శనమని లోకేశ్ (Lokesh) స్పష్టం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్టుపై ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని దేశాల్లో నిరసనలు జరిగిన సందర్భం, ఇంత స్థాయిలో స్పందన వచ్చిన ఘటన మరొకటి లేదని వెల్లడించారు.
హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ (Nalgonda) సహా తెలంగాణలోని అనేక జిల్లాల్లో, మహారాష్ట్ర, కర్ణాటకలోని బళ్లారిలో అభిమానులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మద్దతు తెలపడంపై లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేని వివిధ వర్గాల ప్రజలు బయటకు వచ్చి మద్ధతు ప్రకటించడం తమకు ఎంతో ధైర్యాన్నిస్తుందని.. వారందరికీ తమ కుటుంబం నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. చంద్రబాబు పాలసీల కారణంగా లబ్ది పొందిన వర్గాలు నేడు పెద్ద ఎత్తున మద్ధతు పలుకుతున్నాయని... ఇదీ చంద్రబాబు క్రెడిబిలిటీ అంటే అని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
TDP Protests Across Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా.. 'బాబుతో నేను అంటూ' నిరసనలు